నేటికీ అందని నవంబర్‌ నెల జీతాలు

Dec 22,2023 11:26 #Employees, #Health Mission
  • జాతీయ ఆరోగ్య మిషన్‌ ఉద్యోగుల ఆవేదన

ప్రజాశక్తి- విశాఖపట్నం :   క్రిస్మస్‌ పండగ దగ్గరికి వస్తున్నా తమకు నవంబర్‌ నెల వేతనాలు ఇంకా అందకపోవడంతో వైద్యఆరోగ్యశాఖ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం)లో పనిచేస్తున్న ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. దసరా, దీపావళి, ఇపుడు క్రిస్మస్‌ ఇలా అన్ని పండగలకు సకాలంలో వేతనాలు అందకపోవడం వల్ల కుటుంబాలతో ఇబ్బందులు పడుతున్నామని నేషనల్‌ హెల్త్‌మిషన్‌ ఉద్యోగుల యూనియన్‌ జిల్లా కమిటీ సభ్యులు గోపి, వీరబ్రహ్మం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 196 కేడర్‌లతో 22వేల మంది ఎన్‌హెచ్‌ఎంలో విధులు నిర్వహిస్తుండగా, ఉమ్మడి విశాఖలో 1500మందికి పైగా ఈ విభాగంలో పనిచేస్తున్నారు.తమకు కేంద్రం, రాష్ట్రం 60: 40 నిష్పత్తిలో వేతనాలు చెల్లించాల్సి ఉందని, అయినా ప్రతినెలా సకాలంలో వేతనాలు అందక ఆలస్యం కావడంతో అవస్థలు పడక తప్పడం లేదని వాపోతున్నారు. వేతనాలు సక్రమంగా అందకపోవడం వల్ల ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్‌ ఫీజులు, నిత్యావసరాలు, ఇలా నెలవారీ కుటుంబపోషణ వ్యవహారాలన్నీ ఎలా సాగుతాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ప్రతినెలా ఒకటోతేదీన వేతనాలు చెల్లింపు చర్యలు చేపట్టాలని,  అలాగే ప్రస్తుతం క్రిస్మస్‌కు వచ్చేనెలలో వచ్చే సంక్రాంతి ముందే వేతనాలు చెల్లింపునకు చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు. దీనిపై నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఎండి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ తక్షణ చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు.

➡️