వైసిపి హయాంలో ఇరిగేషన్‌పై నిర్లక్ష్యం

-కాల్వల కింద చివరి ఎకరాకూ నీరిచ్చేలా చర్యలు
– మంత్రి నిమ్మల రామానాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి ప్రభుత్వ హయాంలో సాగునీటి పారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. వ్యవసాయానికి సంబంధించి సాగునీటికి సమస్యలు రాకుండా పంటకాల్వల కింద చివరి ఎకరాకు కూడా నీరందేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌ నుంచి జిల్లాల్లోని జలవనరులశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాలంలో ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. కాలువలు, డ్రైన్లను పది రోజుల్లో పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. ప్రధానంగా తూడు, గుర్రపు డెక్క, మట్టి తొలగింపు పనులను తక్షణం చేపట్టాలన్నారు. కాలువలు, డ్రైన్లలో లాకులు, అవుట్‌ స్లూయిస్‌, షట్టర్‌ తలుపుల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. గత ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులు, కాలువలు, డ్రైన్లు, ఏటిగట్లు వంటి పనులు కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయని విమర్శించారు. చిన్నపాటి వర్షానికి వేలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో గోదావరి ఏటి గట్ల పటిష్టతకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. పోలవరంతోపాటు ఇతర ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో విధ్వంసానికి గురయ్యాయన్నారు. అన్నమయ్య, ఫించా, గండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టులను పట్టించుకోకపోవడంతో అవి ధ్వంసమైన విషయం తెలిసిందేనని అన్నారు. సాగునీటి పారుదలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రాజెక్టుల వద్ద, రిజర్వాయరు వద్ద మరమ్మతు పనులు చేపట్టాలని ఆదేశించారు. నదుల అనుసంధానం ద్వారా కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. దవళేశ్వరం, నాగార్జునసాగర్‌, శ్రీశైలం నుంచి విడుదల చేసే నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్‌, జలవనరులశాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఇంజినీరు ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి తదితరులు పాల్గన్నారు.

➡️