చర్చలు విఫలం – అంగన్‌వాడీల సమ్మె యథాతథం

  • తొలగిస్తామన్న ప్రభుత్వ హెచ్చరికలు
  • ఊరుకోబోమన్న సజ్జల

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అంగన్‌వాడీల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం జరిపిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది లేదంటూ మొండిగా వ్యవహరించడంతోపాటు విధుల్లో చేరకపోతే తొలగిస్తామని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చర్చల్లో పాల్గొన్న నేతలపై ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. ఇప్పటి వరకూ అంగన్‌వాడీలను ప్రభుత్వం ఏమీ చేయలేదని, ఇక ముందు ఊరుకునేది లేదని ప్రభుత్వ ప్రతినిధులు హెచ్చరించారు. దీంతో చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోందని, డబ్బులున్నా పెంచకూడదని నిర్ణయించుకున్నామని, వెంటనే విధుల్లోకి చేరకపోతే ప్రభుత్వం ఏమి చేయాలో అది చేస్తుందని చర్చలకు వచ్చిన ప్రభుత్వ ప్రతినిధులు బెదిరింపులకు దిగారని అంగన్‌వాడీ సంఘాల నాయకులు తెలిపారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని, సంక్రాంతి అనంతరం మరింత ఉధృతం చేయడంతోపాటు, నిరవధిక నిరాహారదీక్షలు చేపడతామని అంగన్‌వాడీ సంఘాల నాయకులు హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం మూడుగంటలకు అంగన్‌వాడీ సంఘాల నాయకులను చర్చలకు పిలిచిన ప్రభుత్వం ఐదున్నర గంటలకు ప్రారంభించింది. ప్రభుత్వం తరుపున మంత్రి బొత్స సత్యనారాయణ, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయలక్ష్మి, అంగన్‌వాడీల తరుపున ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బేబీరాణి, సుబ్బరావమ్మ, కోశాధికారి వాణిశ్రీ, ఉపాధ్యక్షులు సుప్రజ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌(ఎఐటియుసి) నుండి లలితమ్మ, ప్రేమ, ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(ఐఎఫ్‌టియు) నాయకులు వి.ఆర్‌.జ్యోతి, గంగావతి, భారతి పాల్గొన్నారు. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన నాయకులు ప్రభుత్వం ఏమి చేయగలదో చెప్పాలని కోరారు. తమ కీలక డిమాండ్లయిన గ్రాట్యుటీ, వేతనాల పెంపుపై స్పష్టమైన హామీ ఇవ్వాలని సంఘాల నాయకులు కోరారు. నాలుగున్నర గంటల పాటు జరిగిన చర్చల్లో ప్రభుత్వం పాత అంశాలనే చెప్పింది మినహా కొత్తగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. పైగా సమ్మె విరమిస్తేనే గతంలో ఇచ్చిన హామీలపై జిఓలు ఇస్తామని, లేనిపక్షంలో ఏమి చేయాలో అదిచేస్తామని బెదిరింపులకు దిగింది. కీలకమైన అంశంలో స్పష్టత లేకుండా చర్చలు ఏమిటని నాయకులు ప్రశ్నించగా, చేయాలనుకున్నది చేస్తామని, డిమాండ్లు, సమ్మెలు చేసినంత మాత్రాన పెంచాలని ఏమీ లేదని హెచ్చరింపు ధోరణిలో ప్రభుత్వ ప్రతినిధులుమాట్లాడారు. నోటీసులు ఇస్తున్నామని, విధుల్లో చేరకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చూడటంతోపాటు అవసరమైతే విధుల నుండి తొలగిస్తామని అన్నారు. పెంచకూడదనేది ప్రభుత్వ నిర్ణయమన్నారుకె.సుబ్బరావమ్మ, ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు)ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌(సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ . చర్చల అనంతరం వెలగపూడి సచివాలయంలో చర్చల బృందం తరుపున మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇచ్చిన హామీకి అదనంగా వర్కర్‌కు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.20 వేలు, హెల్పర్‌కు రూ.10 వేలు, మట్టి ఖర్చులు రూ.20 వేలు ఇస్తామని తెలిపారని చెప్పారు. మినీ వర్కర్లను వర్కర్ల స్థాయికి పెంపునకు సంబంధించి ఇంతవరకు జిఓ ఇవ్వలేదని వివరించారు. అయితే ప్రభుత్వం ఏమి చేయగలదో దానిపై నిర్దిష్ట హామీ ఇవ్వాలని కోరామని, వేతనం 2024 జులై నెలలో పెంచుతామని మాత్రం చెప్పారని, అయితే ఎంత పెంచుతామనేదీ చెప్పలేదని అన్నారు. పెంపుదల ఎంత అనేది స్పష్టమైన హామీ ఇవ్వాలని అందరం కోరామని, ప్రభుత్వం వైపు నుండి చలనం లేదని తెలిపారు. ఏది ఇవ్వగలుగుతారో అదన్నా చెప్పాలని కోరినా స్పందిచంలేదని పేర్కొన్నారు. తాము వేతనాలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే చర్చలకు వచ్చామని, శుక్రవారం జరిగిన చర్చల్లో ఆ దిశగా ప్రభుత్వం ఎటువంటి ముందడుగూ వేయలేదని వివరించారు. పైగా డబ్బులున్నా పెంచకూడదని ప్రభుత్వం నిర్ణయించుకుందని, ఐదేళ్లకోసారి పెంచాలని పాలసీ పెట్టుకున్నామని చర్చల్లో తెలిపారని వివరించారు. వెంటనే విధుల్లో చేరాలని, చేరకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని, తొలగిస్తామని బెదిరించారనీ చెప్పారు. ఇటువంటి బెదిరింపులకు తలొగ్గేది లేదని అన్నారు. అంగన్‌వాడీలు ఎలాంటి పరిస్థితుల్లోనూ భయపడేది లేదని, జగననన్నకు విన్నపమన్న కార్యక్రమం పేరుతో కోటి సంతకాలు సేకరిస్తామనిపేర్కొన్నారు. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదుసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిఅంగన్‌వాడీలు నిరంతరం సమ్మె చేస్తామంటే ప్రత్యామ్నాయం చేయక తప్పదని, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సమ్మె చేస్తే డిమాండ్లు నెరవేర్చేటట్లయితే అందరూ సమ్మెలు చేస్తారని అన్నారు. ప్రభుత్వం ఎంత వరకు చేయగలదో అంత చేస్తామని తెలిపారు. సమ్మెలో ఉన్నవారికి నోటీసులు ఇస్తున్నారని, అనంతరం చేయాల్సింది చేస్తామని హెచ్చరించారు. సమ్మె చేయాల్సినంత కాలం చేశారని, వివిధ రాజకీయ పార్టీలు వారిని రెచ్చగొడుతున్నాయని తెలిపారు. ఒక్కసారి నోటీసు ఇచ్చిన తరువాత అందరూ జాయిన్‌ కాకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంగన్‌వాడీలు పెట్టిన కొన్ని డిమాండ్లపై హామీ ఇచ్చామని, సమ్మె విరమిస్తే వాటిని అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. రిటైర్మెంట్‌ సమయంలో ఇంతవరకు రూ.50 వేలు ఇచ్చేవారని, దీనిపై కేంద్రానికి లేఖ రాసి అక్కడ నుండి వచ్చిన గైడెన్స్‌ ప్రకారం అమలు చేయాలి అనుకున్నాము. అప్పటి వరకూ వర్కర్లకు రూ.1.20 లక్షలు, హెల్పర్లకు రూ.20 వేల నుండి రూ.50 వేలకు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. మట్టి ఖర్చులకు రూ.15 వేలు ఉంటేదాన్ని రూ.20 వేలకు పెంచామని పేర్కొన్నారు. గౌరవవేతనానికి సంబంధించింనంత వరకు 2019 జులైలో సిఎం వెయ్యి రూపాయలు పెంచారని, ఎప్పుడైనా వేతనం సవరించాలంటే కనీసం ఐదు సంవత్సరాలు ఉంటుందని తెలిపారు. శుక్రవారం జరిగిన చర్చల్లో వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖచ్చితంగా పెంచుతామని హామీనిచ్చామని, దీన్ని మినిట్స్‌లోనూ రికార్డు చేశామని వివరించారు. అలాగే రిటైర్మెంట్‌ వయస్సును 60 నుండి 62 ఏళ్లకు పెంచామని తెలిపారు. ప్రమోషన్‌ వయస్సు పరిమితిని 45 నుండి 55 వరకు పెంచామని తెలిపారు. టిఏ, డిఏలు ఒకటీ లేదా రెండు నెలలకు ఒకసారి ఇస్తామని తెలిపామన్నారు.

➡️