బ్యాంకు ఖాతాల్లో పింఛన్లు వద్దు

  •  ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఫిర్యాదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్ల సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు టిడిపి తెలిపింది. ఈ నిర్ణయం దుర్మార్గం అని ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సచివాలయంలో సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. సిఎం జగన్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి ఆరాటపడుతున్నారని విమర్శించారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్న ఆంధ్ర స్పెషల్‌ పోలీసు అధికారులకు పోస్టల్‌ బ్యాలెట్‌ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాగా సంపద సృష్టించడంలో సిఎం జగన్‌ పూర్తిగా విఫలమయ్యారని టిడిపి అధికార ప్రతినిధి నీలాయపాలెం విజరుకుమార్‌ విమర్శించారు. టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతినెలా అప్పులపై ప్రభుత్వం ఆధారపడుతుందన్నారు.

➡️