ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇరువురూ

బాబు హామీల డప్పు

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి

ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఇరువురూ ఒకేసారి జిల్లాకు రావడం, నైట్‌ హాల్ట్‌ ఇక్కడే ఉండడం చాలా అరుదుగా తటస్థిస్తుంది. ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం ఇద్దరూ ఈ నెల 23న పర్యటనకు రావడంతో ప్రచారం హోరెత్తింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగింపు సందర్భంగా టెక్కలిలో 24 నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 23న పాతపట్నం, ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభల్లో, మరుసటి రోజు శ్రీకాకుళంలో మహిళలతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభకు జనాన్ని భారీగా తరలించినా ఆ ఊపును పార్టీకి, ప్రభుత్వానికి మలుచుకోవడంలో విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిఎం ప్రసంగమంతా సంక్షేమ పధకాలు, నగదు బదిలీ, చంద్రబాబుపై రాజకీయ విమర్శల చుట్టే సాగింది. ప్రసంగంలోనూ కొత్తదనం కనిపించలేదు. పాత అంశాలపైనే మాట్లాడడంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు అందులోనూ ఎన్నికల నేపథ్యంలో జరగుతున్న సభ కావడంతో, జిల్లా అభివృద్ధికి సిఎం ప్రకటించే హామీలు, వరాల పైనే సహజంగా అందరిలో ఆసక్తి ఉంటుంది. జిల్లాకు సంబంధించి ఒక్క హామీ లేకపోవడం జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసింది.చంద్రబాబు విషయానికి వస్తే పాతపట్నం, ఆమదాలవలస సభలు రెండింటిలోనూ తెగ హామీలు గుప్పించారు. జనానికి అరచేతిలో వైకుంఠం చూపించారు. యువతకు వర్క్‌ ఫ్రమ్‌ హోం అంటూ ఊహల్లో తేలించారు. టిడిపిని గెలిపిస్తే జిల్లా నుంచి వలసలే ఉండవని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ మూలకు వెళ్లినా సిక్కోలు వాసులే కూలీలుగా ఉంటారని, అక్కడి నగరాల్లో శ్రీకాకుళం కాలనీలే ఉంటాయంటూ తెగ ఆవేదన వెలిబుచ్చారు. 2014లో టిడిపి గెలిచి ఐదేళ్లు పాలించిన తర్వాత ఏమేరకు వలసలు ఆగాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ జిల్లా నుంచి ముఖ్యంగా పాతపట్నం ప్రాంతం నుంచి వలసల పరంపర ఆగడం లేదు. వంశధార పూర్తి చేస్తాం, విద్యాసంస్థలు ఏర్పాటు, నారాయణపురం ఆధునీకరణ పనులు, ఆమదాలవలసకు ఇంజినీరింగ్‌ కళాశాల, పాతపట్నానికి మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు ఇలా చెప్పుకుంటూ పోతో డజను వాగ్దానాలు చేశారు. జనం ఓట్లు పొంది ఏదోరకంగా గట్టెక్కాలని చూస్తున్న బాబు, ఇస్తున్న హామీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. హామీలేమైనా నెరవేరుతాయా అంటే అదీ సందేహమే. చంద్రబాబు ముఖ్యమంత్రిగా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయో అందరికీ తెలిసిందే.ప్రాజెక్టు వల్ల ప్రజలకు మేలు కలిగినట్లుగానే, రైతులకు పరిహారం అందించాలన్నది తన ఆలోచన అని చెప్పుకొచ్చారు. నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు, వారికి ఏరకంగా న్యాయం చేస్తారో మాత్రం చెప్పలేదు. నిర్వాసితులకు భూసేకరణ చట్టం-2013 అమలు చేయకుండా జగన్‌ మోసం చేశారంటూ పదేపదే చెప్తున్న చంద్రబాబు, తాము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని మాత్రం చెప్పలేదు. నిర్వాసితులకు న్యాయం పక్కన పెడితే, వారికి అన్యాయం చేసిన పాతపట్నం నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి కలమట వెంకటరమణకు మాత్రం న్యాయం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాతపట్నం టిక్కెట్‌ను నిరాకరించడంతో అలకబూనిన కలమటను చంద్రబాబు తను బస చేసిన శ్రీకాకుళం నగరంలోని టిడిపి కార్యాలయానికి పిలిపించి బుజ్జగించారు. పాతపట్నంలో మామిడి గోవిందరావును గెలుపునకు పనిచేయాలని సూచించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ ఆ రోజే టిడిపి జిల్లా అధ్యక్షునిగా పట్టాభిషిక్తున్ని చేశారు. కలమటకు బాబు కిరీటం పెట్టినా, పాతపట్నంలో టిడిపికి ఎంతమేరకు విజయం దక్కుతుందో చూడాల్సి ఉంది. ఇప్పటివరకు ఇద్దరూ కలిసి ప్రచారంలో ఇంకా పాల్గొనలేదు. టిక్కెట్‌ రాకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలమట, ఒకానొక దశలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నించారు. కలమట గ్రూపులో ఒక్కొక్కరుగా మామిడి గోవిందరావు పక్షాన చేరుతుండడం, ఇండిపెండెంట్‌గా వేస్తే పార్టీ నుంచి బహిష్కరణ వేటుకు గురికావడం, కేడర్‌కు భవిష్యత్‌ లేకపోవడం వంటి కారణాలతో మనసు మార్చుకుని అధ్యక్ష పదవితో సరిపెట్టుకున్నారు. ఇందులో కింజరాపు కుటుంబం కీలకపాత్ర పోషించినట్లు తెలిసింది. శ్రీకాకుళంలో గుండ లకీëదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణకు తప్పించడంతో అది ఎంపీ అభ్యర్థి రామ్మోహన్‌నాయుడు గెలుపుపై ప్రభావం చూపుతుందన్న ఫీడ్‌బ్యాక్‌తో కలమటను శాంతింపజేసేందుకు అధ్యక్ష పదవిని కట్టబెట్టినట్లు తెలిసింది. గుండ దంపతుల విషయంలో ఆ పాచిక పారలేదు. బాబు ప్రతిపాదనను వారు ససేమిరా అంటూ క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో టిడిపికి నష్టం వాటిల్లే అవకాశాలు ఉండడంతో, నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే స్వయంగా రంగంలోని దిగారు. శ్రీకాకుళం నగరంలోని అంధవరపు వరం కుటుంబాన్ని పార్టీలో చేర్చుకుని బలం పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు గుండ లకీëదేవికి టిక్కెట్‌ రాకుండా కింజరాపు కుటుంబం చేసిందన్న అక్కసుతో గార, అరసవల్లికి చెందిన టిడిపి కేడర్‌ వైసిపిలో చేరింది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరిన్ని పరిణామాలు సంభవించే అవకాశాలు లేకపోలేదు. దీంతో టిడిపి, వైసిపి మధ్య పోరు హోరాహోరిగా సాగే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం బాబు ఇచ్చే హామీలు, జగన్‌ సంక్షేమ పథకాలు అవేవీ పనిచేయవనే చర్చ సాగుతోంది.

➡️