బీసీలను అవమానించిన పవన్

May 10,2024 15:27 #jai bharatparty
  • – టిక్కెట్లు అమ్మేశావ్‌…
    నా తమ్ముడి భవిష్యత్తు నాశనం చేశావ్
    – కుమ్మరిపాలెం సెంటర్‌ నుంచి పోతిన రాము ర్యాలీ
    విజయవాడ: విజయవాడ పశ్చిమలో ఎన్నికల సభ పెట్టి పవన్‌ కల్యాణ్‌ బీసీలను అవమానించారని జైభారత్‌ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతిన వెంకట రామారావు ఆరోపించారు. ఆయన సినీ హీరోలా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌ ఇక్కడ వల్లె వేయడం కాదని, పశ్చిమ రాజకీయ చరిత్ర ఆయనకు తెలియదన్నారు. తమ్మిన పోతరాజు, మరుపిళ్ల చిట్టి, పోతిన చిన్నా, సన్యాసిరావు లాంటి వారు ఎమ్మెల్యేలుగా చేసిన చరిత్ర పశ్చిమ నియోజకవర్గానికి ఉందని, ఇది తెలియక బీసీలను తానే పెంచానని పవన్‌ కల్యాణ్‌ అహంకారం ప్రదర్శిస్తున్నారని పోతిన రాము దుయ్యబట్టారు. విజయవాడ పశ్చిమలో కుమ్మరి పాలెం సెంటర్‌ నుంచి సితార సెంటర్‌ వరకు జై బారత్‌ టార్చ్‌ ర్యాలీ నిర్వహించిన పోతిన రాము కార్నర్‌ మీటింగులలో ఓటర్లనుద్దేశించి మాట్లాడారు. పోతిన మహేష్‌ కు జనసేన టిక్కెట్‌ ఇవ్వకుండా మోసం చేసింది కాక, తనే పెంచి పోషించినట్లు పవన్‌ కల్యాణ్‌ ప్రగల్బాలు పలుకుతున్నారన్నారు. బీసీ రాష్ట్ర నాయకుడిని నువ్వు పెంచేది ఏంటి?తన తమ్ముడు పోతిన మహేష్‌ జనసేనలో చేరక ముందే, బీసీ రాష్ట్ర నాయకుడని, రాష్ట్ర విభజన తర్వాత ఆర్‌. కఅష్ణయ్య అటు తెలంగాణాకు వెళ్ళిపోతే, ఇక్కడ బీసీ ఉద్యమాన్ని నడిపింది ఆయనే అని పోతిన రాము అన్నారు. పవన్‌ మీద అభిమనంతో తను రాష్ట్ర నాయకుడు అనేది మరిచి, జనసేన కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడన్నారు. నా తమ్ముడు నీ కోసం తగ్గితే, నువ్వు అతని రాజకీయ భవిష్యత్తును నమ్మించి, ముంచేశావని, అతని ద్వారా పార్టీని పెంచుకుని, గిరాకీ వచ్చిందని ఎమ్మెల్యే టిక్కెట్‌ ఒక ఆర్ధిక నేరగాడికి అమ్మేశావని విమర్శించారు. మా తమ్ముడి భవిష్యత్తును నాశనం చేశావ్‌. అతడిని క్షమించమని బహిరంగంగా కోరాల్సింది పోయి… తలబిరుసు మట్లాడి బీసీలను అవమానిస్తావా? అంటూ పోతిన రాము పవన్‌ పై విరుచుకుపడ్డారు. అడ్డదారిలో వచ్చిన బీజేపీని పశ్చిమ ప్రజలు నమ్మరని, ఆ అభ్యర్థికి బుద్ధి చెపుతారన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని తాను మోడల్‌ నియోజకవర్గంగా మారుస్తానని పోతిన రాము ప్రజలకు హామీ ఇచ్చారు. విజయవాడకు ప్రధాని మోదీ వచ్చి ఏం మేలు చేశారని ప్రశ్నించారు. రాజధాని అమరావతికి నిధులు ప్రకటించారా? ప్రత్యేక హోదా ప్రకటించారా? మరి దేని గురించి పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు దండాలు పెడుతున్నారని విమర్శించారు. జైభారత్‌ రోడ్‌ షోలో పోతిన రాముతోపాటు కార్మిక నాయకుడు బూరాడ యజ్ణ్ననారాయణ,బెజవాడ నాని, పోతిన శ్రీనివాసరావు, రాయన మణి, తదితరులు పాల్గన్నారు.
➡️