• మొదటి రోజునే 95 శాతం మందికి అందజేత
  • సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సమర్థవంతమైన నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు వుంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారనేదానికి సోమవారం జరిగిన పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియనే నిదర్శనమని సమాచార, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు. ఈ పెన్షన్‌ల పంపిణీని సమర్థవంతంగా పనిచేయగలిగిన వ్యవస్థ ప్రభుత్వంలో వున్నప్పటికీ ఏప్రిల్‌ నెలలో అప్పటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, రాజకీయంగా బురద జల్లడం కోసం వలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయడం సాధ్యం కాదని కొంతమంది ప్రాణాలు పోవడానికి కారకులయ్యారని విమర్శించారు. రాష్ట్రంలో ఒకేరోజు 12 గంటల పరిధిలో 95 శాతం మందికి పెన్షన్లు అందించిన సచివాలయ ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తూ ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. గతంలో తాము సచివాలయ ఉద్యోగులతో పెన్షన్‌ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని కోరితే గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. చిత్తశుద్ధితో కనీస ప్రయత్నం కూడా చేయకుండా అమాయకుల ప్రాణాలు తీసిందన్నారు. 65.18 లక్షల లబ్ధిదారులకు 28 కేటగిరిలో దాదాపు రూ.4,408 కోట్ల పంపిణీ లక్ష్యంగా పెట్టుకుని 61.76 లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4,170 కోట్లను పంపిణీ చేశారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా ఈ పెన్షన్‌ల ప్రక్రియ నిలిచిపోతుందన్నారు. గతంలో 85 శాతానికి మించి ఏనాడూ పంచలేకపోయారన్నారు. రాష్ట్రంలో రూ.35తో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెన్షన్‌ ప్రారంభిస్తే రూ.వెయ్యికి, రూ.రెండు వేలకు తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుది అని అన్నారు. మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజుల్లో రూ.3 వేల నుండి రూ.4 వేలకు పెంచిందన్నారు.

➡️