సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల తొలగింపు

Dec 18,2023 08:11 #Voter List
on-removings-voters

జిల్లా అధికారులకు సిఎఫ్‌డి లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓట్లు తొలగింపు ప్రక్రియను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, మార్గదర్శకాలకు అనుగుణంగానే చేపట్టాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ (సిఎఫ్‌డి) సంస్థ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల పూర్వ ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం జిల్లా కలెక్టర్లకు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులకు బహిరంగ లేఖ రాశారు. అనూప్‌ బరన్‌వాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఓటుహక్కును ప్రాథమికహక్కుగా స్పష్టీకరించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆ తీర్పును అవగాహన చేసుకుని ఓట్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కోసం ఫారం7 ప్రకారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఓటరు ప్రాథమిక హక్కుకు భంగం కలుగకుండా చూడాలన్నారు. సరైన ధ్రువీకరణ, పత్రాల పరిశీలన ద్వారా మాత్రమే ఓటర్ల తొలగింపు చేయాల్సి వుంటుందని, అలా కానిపక్షంలో అందుకు ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులే బాధ్యులు అవుతారని తెలిపారు.

➡️