మాచర్లలో మరోసారి ఉద్రిక్తత 

Feb 29,2024 10:46 #palnadu district, #YCP-TDP CLASH
  • వైసిపి, టిడిపి పరస్పర దాడులు
  • పలువురికి గాయాలు

ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లాలో సమస్యత్మకమైన మాచర్ల నియోజకవర్గంలో వైసిపి, టిడిపి శ్రేణుల మధ్య మరోసారి ఘర్షణ తలెత్తింది. నియోజకవర్గ కేంద్రమైన మాచర్ల పట్టణంలోని షాదీఖానా సమీపంలో టిడిపి శ్రేణులు కొద్దిరోజులుగా ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ప్రచారం చేస్తున్నాయి. అందులో భాగంగా బుధవారం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా వైసిపి శ్రేణులు కూడా తమ కార్యక్రమం ఉందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటుకు ఉపక్రమించాయి. దీంతో ఇరు పక్షాల మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. కర్రలు, రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఇరు గ్రూపుల్లో ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వైసిపి కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రిలో, టిడిపి కార్యకర్తలు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించి మాట్లాడారు. మాచర్లకు టిడిపి ఇన్‌ఛార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డి నియమితులైన తర్వాత గొడవలు రేపుతున్నారని, ఆయన 7 హత్య కేసుల్లో ప్రధాన నిందితుడని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిఎస్‌పితో మాట్లాడానని తెలిపారు. టిడిపికి పెరుగుతున్న ప్రజాదరణను ఓర్వలేకే వైసిపి దాడులకు పాల్పడుతోందని, టిడిపికి చెందిన వారిని హత్య చేసేందుకు పథకాలు పన్నారని టిడిపి నాయకులు ఆరోపించారు. తాజా ఘర్షణల నేపథ్యంలో ఆ ప్రాంతంలో పోలీసులు పికెట్‌ ఏర్పాటు చేశారు.

➡️