బిజెపికి ఒకరు తొత్తు.. మరొకరు పొత్తు

  • హోదా, పోలవరం, ఉక్కు కర్మాగారం ఊసే లేదు
  • బస్సుయాత్రలో వైఎస్‌.షర్మిల

ప్రజాశక్తి-పీలేరు/మదనపల్లె (అన్నమయ్య జిల్లా) : రాష్ట్రంలో వైసిపి, టిడిపిలు తమ స్వలాభం కోసం బిజెపికి ఒకరు తొత్తుగా మారితే, మరొకరు పొత్తుగా నడుపుతున్నారని జగన్‌, చంద్రబాబులను ఉద్దేశించి పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. అన్నమయ్య జిల్లా పీలేరు, వాల్మీకిపురం, మదనపల్లె, తంబళ్లపల్లెలో మంగళవారం ఆమె బస్సుయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా పలుచోట్ల షర్మిల మాట్లాడుతూ.. అన్నదాతలు అతివృష్టి, అనావృష్టితో అల్లాడుతున్నారన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన చంద్రబాబునాయుడు.. అమరావతిని సింగపూర్‌ స్థాయిలో రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పారని, తరువాత అధికారంలోకి వచ్చిన జగన్‌ మూడు రాజధానులు పెడతామంటూ రాజధాని లేని రాష్ట్రంగా చేశారని విమర్శించారు. ఫలితంగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి.. చౌక దుకాణాల ద్వారా ప్రజలకు 11 రకాల నిత్యావసర సరుకులు ఇస్తే, ప్రస్తుత ప్రభుత్వం బియ్యం, చక్కెర మాత్రం ఇస్తూ చేతులు దులుపుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు ఆర్‌టిసి ఛార్జీలు, ఏడుసార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల బతుకులను భారంగా మార్చిందని మండిపడ్డారు. ఐదేళ్ల వైసిపి పాలనలో పోలవరం కానీ, కడప స్టీల్‌ ప్లాంట్‌ గురించి కానీ పట్టించుకోలేదని వివరించారు. గత ఎన్నికల్లో వైసిపి ఇచ్చిన హామీ మేరకు పీలేరులో కోల్డ్‌స్టోరేజ్‌ కానీ, టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ కానీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నజీర్‌ అహ్మద్‌, గాజుల భాస్కర్‌, శ్రీ వర్ధన్‌ చౌదరి, అమృత తేజ పాల్గొన్నారు.

➡️