మున్సిపల్‌ కార్మికులకు వేతనాలు చెల్లించండి – సిహెచ్‌ ఉమామహేశ్వరరావు

Apr 12,2024 21:50 #Dharna, #municipal workers

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మున్సిపాల్టీల్లోని అవుట్‌సోర్సింగ్‌ కార్మికులతోపాటు కరోనా, అదనపు కార్మికులకు మార్చి నెల వేతనం, బకాయిలు, తదితర వాటిని వెంటనే చెల్లించాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మిని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ ఉమామహేశ్వరరావు కోరారు. శుక్రవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి ఆయా సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 17 రోజుల సమ్మె కాలపు వేతనం కూడా గుంటూరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, రెండు మున్సిపాల్టీల్లో ఇవ్వలేదని, రూ.1000 కానుక కూడా ఇవ్వలేదని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. పశ్చిమగోదావరి, ఏలూరు, కాకినాడ, అనంతపురం, సత్యసాయి, ఎన్‌టిఆర్‌, కృష్ణా, పల్నాడు జిల్లాల్లోనూ నేటికీ సమ్మెకాలం వేతనం ఇవ్వలేదని ఆయన తెలిపారు. అలాగే అనేక మున్సిపాల్టీల్లో రూ.6 వేల హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించలేదని చెప్పారు. ఈ సందర్భంగా వై శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున కొత్త జిఓలు జారీ చేయలేమని, బకాయి వేతనాలు, కొత్త వేతనాలు సిఎఫ్‌ఎంఎస్‌ అనుమతి రాగానే వేస్తామని తెలిపారు.

➡️