టిడిపిలో ‘పెన్షన్ల’ టెన్షన్‌

Apr 4,2024 06:49 #pensions in AP, #TDP

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయొద్దన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం రాష్ట్రంలో రాజకీయంగా దుమారం లేపింది. ఇసి నిర్ణయంతో తెలుగుదేశం పార్టీలో తొలుత కొంత ఉత్సాహం కనిపించినప్పటికీ ఆ తరువాత పరిస్థితి మారింది. ఫింఛన్లను అడ్డుకున్నారంటూ వైసిపి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతున్నామన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఈ విషయంలో తమ వ్యూహం బెడిసికొట్టిందని ఆ పార్టీలోని కొంతమంది నేతలే అభిప్రాయ పడుతున్నారు. పింఛన్లు నిలిపివేయాలని చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని వైసిపి గ్రామ స్థాయి నేతలు ఈ రెండు రోజుల్లో విపరీతమైన ప్రచారం చేశారని అంటున్నారు. ప్రభుత్వం ఒకటో తేదీన ఇవ్వాల్సిన పింఛన్‌ నిధులను మూడో తేదీ వరకు ఎందుకు ఇవ్వలేదనే అంశాన్ని సమర్ధంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లడంలో విఫలమయ్యామన్న అభిప్రాయం వినిపిస్తోంది. మూడో తేదీ నాటికి కూడా నిధులు సచివాలయాలకు ఎందుకు అందాలేదో అనే అంశాన్ని గ్రామాల్లో కార్యకర్తల చేత చెప్పించలేకపోయామని భావిస్తున్నారు.పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు రంగంలోకి దిగి రావాల్సి వచ్చింది. పింఛన్ల పంపిణీ ఆలస్యం కాకుండా చూడటంతో పాటు, ఇళ్ల వద్దకు అందించాలని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. వాలంటీర్లు ద్వారా సచివాలయ సిబ్బందిని వినియోగించి పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇదే అంశంపై ఐవిఆర్‌ఎస్‌ ద్వారా ప్రజలకు ఫోన్ల ద్వారా తన సందేశాన్ని వినిపిస్తున్నారు. అయినా, క్షేత్రస్థాయిలో ఈ ప్రచారం ప్రభావం చూపడంపై టిడిపి శ్రేణుల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

➡️