కాంగ్రెస్‌ తీరుపై ప్రజల్లో అసహనం మొదలైంది: కేటీఆర్‌

Jan 9,2024 16:05 #KTR, #press meet

హైదరాబాద్‌: ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్‌ఎస్‌ని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఖమ్మం పార్లమెంట్‌ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యే స్థానాలను గెలిచామని, మరో 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని తెలిపారు.’రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటై నెల దాటింది. వచ్చిన తెల్లారినించే హామీలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు కాలయాపన చేస్తున్నది. ఎన్నికల ముందు కంటే భిన్నంగా కాంగ్రెస్‌ వ్యవహరించడంపట్ల ప్రజల్లో అసహనం మొదలైంది’ అని వ్యాఖ్యానించారు.’ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్‌ సొంతం. గత చరిత్రను పరిశీలిస్తే ఆ విషయం అర్థమవుతుంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎన్టీఆర్‌ నేతృత్వంలోని టీడీపీని తిరస్కరించారు. కాంగ్రెస్‌ను గెలిపించారు. అయితే ఆ తర్వాత ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యింది. ఆ ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది. ఈ వాస్తవాన్ని మరువగూడదు’ అని కేటీఆర్‌ గుర్తుచేశారు.

➡️