సొంతూళ్లకు జనం..

May 13,2024 07:01 #RTC BUS, #services
  • విజయవాడలో సర్వీసులు లేక ప్రయాణికుల పాట్లు
  • రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు : ఆర్‌టిసి ఎమ్‌డి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో సోమవారం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజానీకం పోటెత్తుతున్నారు. వివిధ ఉద్యోగ, వ్యాపార, వృత్తి రీత్యా హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాలకు తరలివెళ్లిన ప్రజలు, యువత ఓట్లు వేసేందుకు సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. గతంలో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పెద్ద సంఖ్యలో జనాలు తరలొస్తుండటంతో బస్సులు, ప్రైవేటు ట్రావెల్స్‌, ఇతర రవాణా సర్వీసులు కిక్కిరిశాయి. మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ఇంకొందరు సొంత వాహనాల్లోనే ఇళ్లకు పయనమయ్యారు. దీంతో జాతీయ, అంతర్రాష్ట్ర రహదారులన్నీ వాహనాలతో నిండిపోయి ట్రాఫిక్‌ జామ్‌ అవుతోంది. ఐటి, ఇతర ఉద్యోగాలకు శనివారం, ఆదివారం సెలవులు కావటం, పోలింగు సందర్భంగా సోమవారం కూడా సెలవురోజు అవటం.. ఈసారి ఇళ్లకు పయనమయ్యే వారి సంఖ్య బాగా పెరిగింది. మరోవైపు రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి (సొంతూరు) వెళ్లేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో బస్టాండ్లు రద్దీగా మారాయి. దీంతో సొంత గమ్యానికి చేరాలంటే ఒక్కొక్కరు బస్సుల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

యువత ఉత్సాహం
గడిచిన పదేళ్లలో లక్షలాది మంది యువత రాష్ట్రం నుంచి ఉపాధి, ఉద్యోగాల కోసం తెలంగాణలోని హైదరాబాద్‌, కర్ణాటకలోని బెంగళూరుకు తరలివెళ్లారు. రాష్ట్రంలో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకపోవటంతో ప్రతి సంవత్సరం లక్షలాది మంది పట్టభద్రులు, ఇంజినీరింగు అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికలు రావటంతో వారంతా కసిగా ఈ ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకుని, భవిష్యత్‌కు బాటలు వేసే పార్టీని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే తొలిసారి ఓటు హక్కు సాధించిన ఎక్కువ మంది యువత కూడా తమ హక్కును వినియోగించుకునేందుకు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా ఊళ్లన్నీ ప్రజలతో సందడిగా మారాయి. సాధారణంగా సంక్రాంతి పండగకు హైదరాబాద్‌ లేదా బెంగళూరు నుంచి ఎక్కువ మంది రాష్ట్రానికి వస్తుంటారు. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ మంది ఓటు వేసేందుకు తరలొస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలా లక్షలాదిగా తరలొస్తున్న యువత ఎవరికి ఓటు వేస్తారు? వారు ఎటువైపు మొగ్గు చూపుతారు? వారి ప్రభావం ఎంత? అనే అంశంపైనా రాజకీయ పక్షాల్లో విపరీతమైన చర్చ నడుస్తోంది.

కిక్కిరిసిన విజయవాడ బస్‌స్టేషన్‌
విజయవాడ పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. ఎన్నికల్లో తమ ఓటును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఇతర సుదూర ప్రాంతాల నుంచి రైళ్లలో వచ్చిన వారు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్సు సర్వీసులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల రద్దీని నియంత్రించడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాలకు వెళ్లేందుకు వేలాది మంది ప్రయాణికులు బస్టాండ్‌లో గంటల తరబడి నిరీక్షించారు. ఈ నెల 12న (ఆదివారం) హైదరాబాద్‌ నుంచి విజయవాడకు ప్రయాణికులను తరలించడానికి 121 స్పెషల్‌ సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్‌టిసి అధికారులు వెల్లడించారు. పెరిగిన ప్రయాణికుల రద్దీకి ఇవి ఏమాత్రమూ చాలకపోవడంతో ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్పెషల్‌ బస్సులో అదనపు ఛార్జీలు వెచ్చించి, కూర్చొనేందుకు సీటు లేక నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోందని పలువురు ప్రయాణికులు వాపోయారు.
ప్రత్యేక బస్సుల కోసం 9959111281 సంప్రదించండి:
ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు
ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్‌ సామగ్రిని గ్రామాలకు తరలించేందుకు 5,458 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఓటర్లకు అవసరమైతే రద్దీని బట్టి 40 మంది వున్నామని కోరితే ఆ ప్రాంతానికి నేరుగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే హైదరాబాద్‌కు 1,066, బెంగళూరుకు 284 ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని తెలిపారు. విజయవాడ నుండి విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు, కాకినాడ, ఏలూరు, ఒంగోలు, గుంటూరు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు ఎక్కువగా నడుపుతున్నామన్నారు. ఎపిఎస్‌ఆర్‌టిసి ఈ ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఎలక్షన్‌ సెల్‌ను ఏర్పాటు చేసిందని, ప్రత్యేక బస్‌ సర్వీసుల కోసం 9959111281 నెంబరును సంప్రదించాలని సూచించారు.

➡️