ఆర్‌టిసి కార్గోలో పికప్‌ సేవలు

Jan 11,2024 09:20 #aps rtc
పలాస, టెక్కలి డిపోల నుంచి ఒడిశాలోని గుణుపూర్‌కు రెండు అంతర్రాష్ట్ర
  • నెలాఖరులో కొత్త బస్సుల రాక
  • సంక్రాంతి రద్దీకి అనుగుణంగా మరో వెయ్యి
  • ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రైవేట్‌ కార్గో సేవలకు మించి సేవలు అందిస్తున్న ఆర్‌టిసి కార్గోలో ఇకపై ఇంటి నుండి వస్తువుల బుకింగ్‌లను తీసుకునేలా కార్గో పికప్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు తెలిపారు. బుధవారం ఆర్‌టిసి హౌస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్‌టిసి పికప్‌ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్‌డి మాట్లాడుతూ.. ఎపిఎస్‌ఆర్‌టిసి 2017 నుంచి రాష్ట్రంలో సొంతంగా కార్గో సేవలు అందిస్తోందన్నారు. 2017కు ముందు 2016లో ఆర్‌టిసికి ఎఎన్‌ఎల్‌ ద్వారా కేవలం ఏడాదికి రూ.9 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చేదన్నారు. ఆర్‌టిసిలోకి వచ్చాక మొదటి ఏడాదే రూ.58.57 కోట్ల ఆదాయం రావడంతో కార్గో సేవలను విస్తృతం చేసేందుకు ఆర్‌టిసి చర్యలు తీసుకుందన్నారు. గతేడాది రూ.169 కోట్లు ఆర్జించగా, ఈ ఏడాది ఇప్పటికే రూ.147.37 కోట్లను ఆర్జించిందని తెలిపారు. 2021 నుంచి డోర్‌ డెలివరీ సౌకర్యాన్ని తీసుకొస్తే మరింత ఆదరణ పెరిగిందన్నారు. కార్గో సేవలను మరింత ప్రజలకు చేరువ చేసేందుకు ఇకపై పికప్‌ సేవలను కూడా అందిస్తామని తెలిపారు. కార్గో వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్‌ చేసి, పేమెంట్‌ చేయగానే కార్గో తరపున ఒకరు వారి ఇంటికి వెళ్లి బుక్‌చేసిన వస్తువులను తీసుకుని గమ్యస్థానాలకు చేరుస్తామన్నారు. ఈ మేరకు బుకింగ్‌ దగ్గర నుండి డెలివరీ పాయింట్‌ వరకూ ప్రతి కదలికనూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 84 కేంద్రాల్లో డోర్‌ డెలివరీ వ్యవస్థ వుందని తెలిపారు. పికప్‌ సర్వీసును ప్రస్తుతం విజయవాడలో మొదలు పెట్టామని, అంచెలంచెలుగా 84 కేంద్రాలకు విస్తరిస్తామని అన్నారు. సంక్రాంతి పండగ నేపథ్యంలో 6,795 ప్రత్యేక సర్వీసులను నడపాలని నిర్ణయించామని, అవసరాన్ని బట్టి మరో వెయ్యి సర్వీసులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి, ఎ కోటేశ్వరరావు, పి కృష్ణమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆర్‌టిసి బస్‌ స్టేషన్‌లో 499 కిలోవాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు.

➡️