శిరోముండనంపై తీర్పును రద్దు చేయాలని పిల్‌

ప్రజాశక్తి-అమరావతి : దళిత యవకుల శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్‌సి, ఎస్‌టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తమను దోషిగా నిర్ధారించి ఏడాదిన్నరపాటు జైలుశిక్ష విధించిన కోర్టు తీర్పును వారు వేర్వేరుగా క్రిమినల్‌ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిని అత్యవసరంగా విచారణ చేయాలని జస్టిస్‌ అడుసుమిల్లి వెంకట రవీంద్ర బాబును పిటిషనరు తరఫున న్యాయవాది కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదని, కింది కోర్టు తీర్పు అమలును నెల రోజులపాటు నిలుపుదల చేసిందని జడ్జి గుర్తు చేశారు. మంగళవారం విచారణ జరుపుతామని చెప్పారు. 1996లో నేరం జరిగితే 2016లో వచ్చిన సవరణ చట్టం ఆధారంగా ప్రాసిక్యూషన్‌ వాదనలు వినిపించిందని, 2016 చట్టం పూర్వ నేరాలకు వర్తించదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రత్యేక కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరారు.
వలంటీర్ల రాజీనామాలను ఆమోదించొద్దని పిల్‌
చట్టసభలకు ఎన్నికలు ముగిసేంత వరకు వలంటీర్ల రాజీనామాలను ఆమోదించకుండా ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వాలంటూ భారత చైతన్య యువజన పార్టీ (బిసివైపి) అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్‌ హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిని విచారణ చేపట్టాలని జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ ఎదుట పిటిషనర్‌ న్యాయవాది కోరారు. మంగళవారం విచారిస్తామని జడ్జి ప్రకటించారు.

➡️