తిరుమలలో కొనసాగుతున్న యాత్రికుల రద్దీ..

తిరుమల: శ్రీవారి దర్శనానికి తిరుమలలో యాత్రికుల రద్దీ శనివారం కూడా కొనసాగుతోంది. టోకెన్లు లేని యాత్రికులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. రింగు రోడ్డు మీదుగా శిలాతోరణం వరకు సుమారు 2 కిలోమీటర్ల వరకు క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. యాత్రికులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు తదితర సౌకర్యాలను అధికారులు ఎప్పటికప్పుడు అందిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం, డీప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, తిరుమల తిరుపతి దేవస్థానం భద్రతాధికారులు ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ రద్దీ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది.

➡️