‘పిన్నెల్లి’కి కౌంటింగ్‌ హాల్‌లోకి నో ఎంట్రీ : సుప్రీం ఆదేశం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్‌ హాల్‌లోకి అనుమతించొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇవిఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టు మధ్యంతర ఉపశమనం కల్పించడాన్ని సవాల్‌ చేస్తూ టిడిపి ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఎన్నికల సంఘం తరపున సీనియర్‌ న్యాయవాది జె కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పిన్నెలికి బెయిల్‌ ఇస్తూ దిగువకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కోర్టులో ప్రదర్శించారు. దీనిపై పిన్నెల్లి తరపున సీనియర్‌ న్యాయవాది వికాష్‌సింగ్‌ వాదనలు వినిపిస్తూ., అధికారిక వీడియో కాదని అన్నారు. నంబూరి శేషగిరిరావు తరపున న్యాయవాది జె మెహతా జోక్యం చేసుకుని ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఇవిఎం ధ్వంసం చేసిన వ్యక్తికి ముందస్తు బెయిల్‌ ఇవ్వడమేంటని హైకోర్టును ప్రశ్నించారు. కౌంటింగ్‌ హాలులోకి పిన్నెలిని అనుమతించవద్దని, జూన్‌ ఆరున బెయిల్‌ పొడిగింపుపై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ధర్మాసనం ఆదేశించింది.

➡️