పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని

Feb 28,2024 08:38 #bhavan, #issro, #PM Modi, #pslv

ప్రజాశక్తి- సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా) :సుమారు రూ.1800 కోట్ల ఖర్చుతో నిర్మించిన మూడు ప్రధానమైన అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగపడే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేద్ర మోడీ మంగళవారం ప్రారంభించారు. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభారు స్పేస్‌ సెంటర్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్లో ‘పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ’ భవనం, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్‌ కాంప్లెక్స్‌లో ‘సెమీ క్రయోజనిక్స్‌ ఇంటిగ్రేటెడ్‌ ఇంజిన్‌ అండ్‌ స్టేజ్‌టెస్ట్‌ ఫెసిలిటీ’ ప్లాంట్‌, విఎస్‌ఎస్‌సి వద్ద ‘ట్రైసోనిక్‌ విండ్‌ టన్నెల్‌’ప్లాంట్‌ను మోడీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. శ్రీహరికోటలోని పిఎస్‌ఎల్‌వి ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ (పిఐఎఫ్‌) అందుబాటులోకి రావడంతో పిఎస్‌ఎల్‌వి ప్రయోగాల సంఖ్యను పెంచడానికి దోహదపడుతుందని అన్నారు. ఏడాదికి ఆరు నుంచి 15 ప్రయోగాలు జరపడానికి వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ఈ అత్యాధునిక సదుపాయం ద్వారా ప్రయివేటు అంతరిక్ష సంస్థలు రూపొందించిన ఎస్‌ఎస్‌ఎల్‌వి ఇతర చిన్న ప్రయోగ వాహనాల ప్రయోగానికీ ఉపయోగపడుతుందన్నారు. గగన్యాన్‌ ద్వారా అంతరిక్షంలోకి పంపడానికి భారత్‌ సిద్ధం చేసిన నలుగురు ఆస్ట్రోనాట్లనూ ఈ సందర్భంగా ప్రధానికి ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ పరిచయం చేశారు.

➡️