టిడిపి నేతలు, నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల ఇళ్లలో పోలీసుల సోదాలు – రూ.1.81 కోట్లు స్వాధీనం !

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి : నెల్లూరు జిల్లా రవాణా శాఖాధికారి ఫిర్యాదు మేరకు టిడిపి నేత, మాజీ మంత్రి పొంగూరు నారాయణ మద్దతుదారులు, నారాయణ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల నివాసాల్లో సోమవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. బాలాజీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి ముప్పాళ్ల విజేత రెడ్డి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆమె ఇల్లంతా తనిఖీ చేశారు. నగదు ఎక్కడ ఉందంటూ ప్రశ్నించారు. తన వద్ద ఎలాంటి నగదూ లేదని, ఎందుకు వచ్చారని ఆమె నిలదీశారు. దీంతో, పోలీసులు అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం నారాయణకు ఫైనాన్షియర్‌గా ఉంటున్న ప్రముఖ వ్యాపారవేత్త కోట గురుబ్రహ్మం, నారాయణ విద్యా సంస్థల జనరల్‌ మేనేజర్‌ వేమిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నారాయణ విద్యా సంస్థల అకౌంటెంట్‌ తదితరుల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ముప్పాళ్ల విజేత రెడ్డి నివాసాన్ని మూడుసార్లు తనిఖీ చేసినా పోలీసులు కేవలం 25 వేల రూపాయలే గుర్తించారు. తనిఖీల విషయం తెలుసుకొని విజేతరెడ్డి నివాసానికి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెళ్లి పోలీసులను ప్రశ్నించారు. రాంజీ నగర్‌ మొదటి వీధిలోని గిరీష్‌కుమార్‌ ఇంట్లో రూ.1,06,06,000, హరినాథ్‌పురం రెండో లైన్‌లోని బి.ప్రసాద్‌ ఇంట్లో రూ.20,50,000, రామలింగాపురం ఒకటో వీధిలోని కోట గురుబ్రహ్మం ఇంట్లో రూ.25,55,000, చింతారెడ్డిపాళెంలోని నారాయణ స్టాప్‌ క్వార్టర్స్‌లోగల ఓ ఇంట్లో రూ.29,45,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. కోట గురుబ్రహ్మంను బాలాజీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి అనంతరం విడిచిపెట్టారు. తనిఖీల్లో మొత్తం కోటీ 81 లక్షల రూపాయలకుపైగా సీజ్‌ చేశామని పోలీసులు తెలిపారు. ఈ డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ చూపలేకపోవడంతో ఆ మొత్తాన్ని ఆదాయపు పన్ను శాఖాధికారులకు అప్పగిస్తామని చెప్పారు. నారాయణ బంధువైన పునీత్‌పై బాలాజీ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

‘నారాయణ’ యాజమాన్యం మోసగించింది : ఎస్‌పి

                      నారాయణ విద్యాసంస్థలు నకిలీ పత్రాలు సమర్పించి ఎన్‌ స్పెరా సంస్థ ద్వారా పాఠశాల బస్సులను 91 కొనుగోలు చేసిందని ఎస్‌పి తిరుమలేశ్వరరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకున్న రూ.1.81 కోట్లకుపైగా నగదును చూపించారు. ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ నకిలీ పత్రాల ద్వారా నారాయణ విద్యా సంస్థల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారన్నారు. దీనివల్ల రవాణా శాఖ కోటీ 12 లక్షల రూపాయల ఆదాయం కోల్పోయిందని చెప్పారు. ఈ వ్యవహారమంతా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ గుర్తించి విచారణ చేపట్టాలని రవాణా శాఖను కోరిందని, రవాణా శాఖాధికారులు ఈ నెల 2న నెల్లూరులోని బాలాజీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీంతో, సోదాలు నిర్వహించామని, విచారణ అనంతరం మరిన్ని వివరాలు తెలియజేస్తామని చెప్పారు.

➡️