డిఎస్‌సి వాయిదా వేయాలి

– సిఎస్‌కు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి లేఖ

– ఎన్నికల అనంతరం మెగా డిఎస్‌సి నిర్వహించాలి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :డిఎస్‌సి వాయిదా వేసి ఎన్నికల అనంతరం మెగా డిఎస్‌సి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన లేఖ రాశారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగ యువత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఎన్నికల షెడ్యూలు నేపథ్యంలో సమగ్రంగా, మెగా డిఎస్‌సిని ప్రకటించలేదని తెలిపారు. రూ.30 వేల పోస్టులు ఖాళీ ఉండగా, ఆరువేల పోస్టులకు మాత్రమే డిఎస్‌సి ప్రకటించడం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తప్ప మరొకటి కాదని అన్నారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రకారం కార్యక్రమం ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మార్చి 30 నుంచి ఏప్రిల్‌ 30 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ సమయంలో విద్యార్థులు చదువుకోవడానికి అంత సానుకూలత ఉండదని తెలిపారు. అలాగే టెట్‌ పరీక్షలు జరిగాయని, డిఎస్‌సి ప్రిపేర్‌ కావడానికి కూడా సమయం కావాలని అన్నారు. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సన్నద్ధం అవుతున్నారని, వీరంతా పదోతరగతి పేపర్లు దిద్దడానికి వెళ్లాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

➡️