ప్రజాశక్తి సీనియర్‌ పాత్రికేయులు అప్పారావు మృతి

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌ (అనకాపల్లి) : ప్రజాశక్తి నర్సీపట్నం సీనియర్‌ పాత్రికేయులు వడ్లమూరి అప్పారావు (51) అనారోగ్యంతో ఆదివారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో మృతి చెందారు. సోమవారం ఉదయం అప్పారావు భౌతికకాయాన్ని ప్రజాశక్తి బృందం సందర్శించి నివాళులర్పించింది. పలువురు పాత్రికేయులు, ప్రజాసంఘాల నాయకులు తరలివచ్చి నివాళులర్పించారు. సిపిఎం నాయకులు అప్పారావు పార్థీవదేహంపై ఎర్రజెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన మృతి పత్రికా రంగానికి, పార్టీకి తీరనిలోటు అని చెప్పారు. ఆయన కృషి మరువలేనిదన్నారు. ప్రజాశక్తి పత్రికా సంపాదకులు బి.తులసీదాస్‌, సిజిఎం వై.అచ్యుతరావు, జనరల్‌ మేనేజర్‌ ఎం.వెంకటేశ్వరరావు, ఎడిటోరియల్‌ బోర్డు సభ్యులు జి.సత్యాజీ, సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం వేరువేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.

అప్పారావు విద్యార్థి దశలోనే ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడిగా విద్యార్థుల సమస్యలపై పోరాడారు. యువజన సంఘంలోనూ పనిచేశారు. అనంతరం ప్రజాశక్తిలో విలేకరిగా చేరి సుమారు 25 ఏళ్లకుపైగా సేవలందించారు. పత్రికకు నర్సీపట్నంలో బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చారు. ఆయన రాసిన కథనాలు, వార్తలు పలువురిని కదిలించాయి. ప్రజలను ఆలోచింపచేశాయి. వారి మన్ననలు పొందాయి. అప్పారావు 1992 లో సిపిఎం సభ్యత్వం స్వీకరించి ఆ పార్టీలోనూ చురుగ్గా కదిలారు. ఉద్యమాల్లో పాల్గన్నారు. కోవిడ్‌ సమయంలో కోవిడ్‌ బారినపడి పెరాలసిస్‌కు గురై నాటి నుండి ఇంటికే పరిమితమయ్యారు. దళిత, పేద కుటుంబం నుండి వచ్చిన అప్పారావు ఏ రోజూ ఏ ఒక్కరి దగ్గరా చేయిచాచిన దాఖలాలు లేవు. నీతి, నిజాయితీ, నిబద్ధతతో పనిచేశారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరనిలోటు.

➡️