విశాఖ ఉక్కుపై పురంధేశ్వరి అబద్ధాల ప్రచారం : సిఐటియు

  • కార్మికుల, ప్రజలు మోసపోరని ప్రకటన

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రానున్న ఎన్నికల కోసం విశాఖస్టీల్‌ ప్లాంట్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సిఐటియు రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ మేరకు యూనియన్‌ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నర్సింగరావు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ అబద్ధాలతో కార్మికులు, ప్రజలు మోసపోరని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను లాభాల బాట పట్టించడం కోసం వాటాలు అమ్మకుండా మెరుగ్గా నడిపించడానికి కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టిన్నట్లు పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
దేశంలోని ప్రైవేట్‌, పబ్లిక్‌ సెక్టార్‌ స్టీల్‌ప్లాంట్‌లన్నీ రెండేళ్లలో లాభాల్లో నడిచాయని తెలిపారు. విశాఖ ప్లాంట్‌ రెండేళ్ల నుంచి రూ.4వేల కోట్లకుపైగా నష్టాల్లోకి వెళ్లడానికి బిజెపి ప్రభుత్వ విధానాలే కారణమని పేర్కొన్నారు.
వాటాలు అమ్మడమే కాకుండా నూరుశాతం ప్లాంట్‌ను అమ్మాలనే లక్ష్యంతో 2021 జనవరి 27న వ్యూహాత్మకంగా కేంద్రప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిందని తెలిపారు. దక్షిణకొరియా పోస్కోతో కేంద్ర స్టీల్‌శాఖ ఎంఓయు చేసుకుందని గుర్తుచేశారు. మూడో బ్లాస్ట్‌ ఫర్నిస్‌కు ముడిసరుకు సరఫరా పేరుతో జిందాల్‌తో చేసిన ఒప్పందం విశాఖ స్టీల్‌ను కారుచౌకగా అమ్మకానికి పెట్టే కుట్రలో భాగమేనని తెలిపారు. నూరుశాతం అమ్మకానికి పెట్టిన వాస్తవాన్ని మరుగునపర్చి ఎన్నికల్లో లబ్ధిపొందడానికి పురంధేశ్వరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు.
భూములు ఎక్కడకూ పోవని, ప్లాంట్‌తోనే ఉంటాయని బిజెపి నాయకులు మొదటి నుంచి చేసే వాదన కూడా పూర్తి అబద్ధమని పేర్కొన్నారు. ప్రైవేట్‌కు అమ్మితే 22వేల ఎకరాల ప్లాంట్‌ భూములు వారి చేతుల్లోకి వెళ్లడం ఖాయమని తెలిపారు. లాభాల బాటలో నడపాలంటే నూరుశాతం అమ్మకం చేయాలనే నిర్ణయాన్ని కేంద్రప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, తక్షణమే ఎన్‌ఎమ్‌డిసి నుంచి ముడి ఖనిజాన్ని అప్పు రూపంలో సరఫరా చేయించాలని డిమాండ్‌ చేశారు. జిందాల్‌తో చేసుకున్న మూడో బ్లాస్ట్‌ ఫర్సిస్‌కు ముడిసరుకు సరఫరా చేసే ఒప్పందం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పదేళ్లుగా కార్మికులు, అధికారులకు పెండింగ్‌లో ఉన్న వేతన ఒప్పందం అమలు చేయాలని కోరారు.

➡️