Rains Alert : వాయుగుండం ప్రభావంతో వర్షాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. వాయుగుండం పశ్చిమ బెంగాల్‌ వైపు కదిలినా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షాలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లోనూ వర్షాలు నమోదవుతాయని తెలిపారు. శుక్రవారం నాడు కాకినాడలో 96 మిల్లీమీటర్లు, శంఖారావంలో 65.2, పిఠాపురంలో 62.5, పెదపూడిలో 59, యలమంచిలిలో 42.7, సామర్లకోటలో 39.7, చింతపల్లిలో 35.5, నర్సీపట్నంలో 20.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడినట్లు పేర్కొన్నారు. శనివారం నాడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అంబేద్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, కడప జిల్లాల్లో పిడుగులతోపాటు వర్షాలు పడే అవకాశం వుందన్నారు. ఆదివారం నాడు శ్రీకాకుళం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్‌టిఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం వుందని, ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు.

➡️