భీమిలిలో రసవత్తర పోటీ

Apr 30,2024 03:30 #2024 election, #bheemili
  •  ముత్తంశెట్టి, గంటా 
  • కాంగ్రెస్‌ అభ్యర్థి వర్మరాజు ప్రచారం

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో : రాష్ట్రంలో చారిత్రాత్మక ప్రాధాన్యత గల అసెంబ్లీ నియోజకవర్గాల్లో విశాఖ జిల్లా భీమిలికి ప్రత్యేక గుర్తింపు ఉంది. డచ్‌, బ్రిటిష్‌ ప్రభుత్వాలకు ప్రధాన వ్యాపార కేంద్రంగా ఇది విలసిల్లింది. అంతేకాక పాండవులు వనవాస కాలంలో ఈ ప్రాంతంలో కొంతకాలం తలదాచుకున్నట్లు పురాణ కథలు చెబుతున్నాయి. విశాఖ పార్లమెంట్‌ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో భీమిలిలోనే అత్యధికంగా 3.61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఆనందపురం, పద్మనాభం, భీమునిపట్నం, మధురవాడ ప్రాంతాలు ఈ పరిధిలోకి వస్తాయి. 1983 నుండి 1999 వరకూ 5 దఫాలు టిడిపి ఇక్కడ విజయ కేతనం ఎగరేసింది. పూసపాటి ఆనందగజపతిరాజు ఒకసారి, ఆర్‌ఎస్‌డిపి అప్పలనరసింహరాజు నాలుగుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2004లో కాంగ్రెస్‌ గెలిచింది. 2009లో ప్రజారాజ్యం నుంచి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, 2014లో టిడిపి నుంచి గంటా శ్రీనివాసరావు, 2019లో వైసిపి నుండి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గెలిచారు. తాజా ఎన్నికల్లో ముత్తంశెట్టి శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు పోటీపడుతున్నారు. 2019లో విశాఖ ఉత్తరం నియోజకవర్గం నుండి ఎన్నికైన గంటా….ఇప్పుడు భీమిలికి మారి…. ముత్తంశెట్టితో తలపడుతున్నారు. ఇండియా వేదిక బలపరిచిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అడ్డాల వెంకట వర్మరాజు…ప్రచారం చేసుకుంటున్నారు.

ఇమేజ్‌ పెంచుకున్న ముత్తంశెట్టి
స్థానిక శాసనసభ్యునిగా ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు మెరుగైన పరిచయాలున్నాయి. గడిచిన ఐదేళ్లుగా ఆయన ప్రజలతో అంటిపెట్టుకుని గంటా బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినేలాగా.. విస్తృతంగా పర్యటనలు చేశారు. ఈ ఎన్నికల్లో గంటాను ఇంటికి పంపిస్తానంటూ ఆయన శపథం చేశారు. గంటాతో పోల్చితే అంగబలంలో ముత్తంశెట్టి తక్కువ వ్యక్తేమీ కాదు. ఆయనపై అవినీతి ఆరోపణలు లేవు. గంటాపై గతంలో విశాఖ జిల్లా ప్రభుత్వ గ్రంథాలయ సంస్థ స్థలం కబ్జా చేసిన కేసు ఉంది. అలాగే టిడిపి హయాంలో భూ కుంభకోణాల్లో సిట్‌లోనూ గంటా శ్రీనివాసరావు పేరుంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే స్వయంగా గంటాపై విమర్శలు గుప్పించేవారు. తగరపు వలస జ్యూట్‌ మిల్లు అక్రమ లాకౌట్‌ అనంతరం కార్మికులకు సరైన పరిహారం ఇప్పించడంలో గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఉమ్మడిగా విఫలం అయ్యారన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు బలమైన రాజకీయ ఉద్దండుల మధ్య ఇండియా బ్లాక్‌ తరపున కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట వర్మరాజు …తనదైన శైలిలో ప్రచారం చేసుకుంటున్నారు…..ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

గెలిచిన చోట …మళ్లీ పోటీచేయని గంటా
పోటీచేసిన నియోజకవర్గంలో స్థానికంగా గంటా ఉండరు. ఒకవేళ అక్కడ గెలిచినా సరే ఇంకోసారి అక్కడ సీటు కోరుకోరు. ఎందుకంటే ఆయనది ప్రత్యేక మంత్రాంగం. ‘సంతలో సరకులను కొన్నట్టుగా హోల్‌సేల్‌గా ప్రత్యర్థి వెనక ఉన్న చిన్నా, పెద్దా లీడర్లను కొనుగోలు చేసే సొంత వ్యూహమే దీనికి కారణం. భీమిలి నియోజకవర్గంలో ఆలస్యంగా గంటా వచ్చినా వైసిపి అభ్యర్థి ముత్తంశెట్టి వెనుక ఉండే కొద్దిమందిని తనవైపు ఇలాగే లాక్కొన్నారనే విమర్శలు ఎదుర్కొటున్నారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌ బాగా తెలిసిన అతి కొద్దిమందిలో గంటా ఒకరు. ఒకే చోట రెండు మూడుసార్లు గంటా మంత్రాంగం చెల్లదు కాబట్టి ఎన్నిక, ఎన్నికకూ వేరొక చోటకి సునాయాసంగా వెళ్లిపోతారు. ఇప్పటికే భీమిలిలో 8వేల మందిని తనవైపు తిప్పుకున్నట్లు గంటా సొంత సోషల్‌మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. గతంలో అనకాపల్లి ఎంపీగాను, తర్వాత భీమిలి, ఉత్తరంలో ఎంఎల్‌ఏగా కూడా ఈ మంత్రాంగమే గంటాను గట్టెక్కించిందని అనుచరులు చెప్పుకుంటూంటారు. .

➡️