మార్చురీలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు

May 10,2024 22:57 #mylavaram

– మైలవరం ప్రభుత్వాస్పత్రిలో ఘటన
ప్రజాశక్తి – మైలవరం :మార్చురిలో ఉంచిన మృతదేహాన్ని ఎలుకలు కొరికిన సంఘటన ఎన్‌టిఆర్‌ జిల్లా మైలవరంలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం… మైలవరం మండలం కొత్త మంగాపురం గ్రామానికి చెందిన వేమిరెడ్డి అచ్చిరెడ్డి నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. జి.కొండూరు మండలం చెరువు మాధవరం రైల్వేట్రాక్‌ పక్కన నాలుగు రోజుల క్రితం ఒకరు చనిపోయి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి ఆ ప్రాంత పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మఅతదేహాన్ని బుధవారం రాత్రి మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రీజర్‌లో ఉంచారు. మృతుని సమాచారం లభించకపోవడంతో వివరాల కోసం ఫొటోతో సహా పోలీసులు ప్రకటనను విడుదల చేశారు. ఈ క్రమంలో అచ్చిరెడ్డి కుటుంబీకులు గుర్తించి పోలీసులను సంప్రదించారు. శుక్రవారం ఉదయం మైలవరం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి అచ్చిరెడ్డి మృతదేహంగా గుర్తించారు. అయితే, మృతదేహం కుడి కన్ను, ఒంటిపై చర్మాన్ని ఎలుకలు కొరికి తిన్నట్లుగా గమనించారు. ఒంటిపైనే కొన్ని ఎలుకలు చనిపోయి ఉండటాన్ని గమనించి ఆస్పత్రి సిబ్బందిని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పకపోవడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో మఅతదేహాలకు కూడా భద్రత లేదని, ఎలుకలు తింటున్నాయని ఆస్పత్రి సిబ్బందిపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు.
రక్షణ చర్యలు చేపట్టాం
ఆస్పత్రి సూపరింటెండెంట్‌
మృతదేహాన్ని ఎలుకలు కొరికిన విషయమై మైలవరం ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ జయ ప్రకాష్‌ను వివరణ కోరగా.. గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు తీసుకురాగా, ప్రీజర్లో రెండు రోజులపాటు ఉంచామని తెలిపారు. మృతదేహం ఎండలో ఉండడం, ఆ తర్వాత చల్లదనంలో ఉంచడం వల్ల చర్మం ఊడుతుందని చెప్పారు. ఒక్కోసారి ఇలా జరగవచ్చని చెప్పారు. విషయం తెలిసిన తర్వాత మార్చురీలోకి ఎలుకలు, పిల్లులు తదితరాలు రాకుండా రక్షణ చర్యలు చేపట్టామన్నారు. తన దృష్టికి రాగానే సిబ్బందిని మందలించానని వివరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదని వివరణ ఇచ్చారు.

➡️