రాష్ట్రంలో గిరిజనులకు భరోసా

  • ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ డివిజి శంకరరావు
  • సంక్షేమ పథకాలు, హక్కులపై చైతన్యం

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో గిరిజనులందరికీ భరోసా కల్పించడమే ఎస్‌టి కమిషన్‌ ప్రధాన ఉద్దేశమని, దీనిలో భాగంగా వారికి అమలవుతున్న సంక్షేమ పథకాలు, పొందాల్సిన హక్కులపై వారిని చైతన్యం చేస్తున్నామని రాష్ట్ర ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ డివిజి శంకరరావు అన్నారు. సోమవారం కమిషన్‌ కార్యాలయంలో గిరిజనుల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. అనంతరం ఆయన్ను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్‌టి కమిషన్‌ గిరిజనులందరికీ అండగా ఉంటుందనే అవగాహన ఇప్పటికీ లేదని, దీన్ని కల్పించే పని చేస్తున్నామని తెలిపారు. కొన్ని చట్టపరమైన అంశాలపై కలెక్టర్లకు సూచనలు చేసే అధికారం కమిషన్‌కు ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏడు ఐటిడిఎల పరిధిలో ఉంటున్న గిరిజనులు ఇప్పటికీ అనేక విషయాల్లో అవగాహన లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వారికి సంబంధించి ఆర్‌ఒఎఫ్‌ఆర్‌ పట్టాల విషయంలో ఇప్పటికీ ఫారెస్ట్‌, రెవెన్యూ విభాగాల మధ్య సమస్యలున్నాయని, చాలాచోట్ల పట్టాలున్నా భూములు ఎక్కడున్నాయో తెలియదని, వాటికి విద్యుత్‌ సరఫరా సదుపాయం లేకపోవడంతో మోటార్లు వేసుకునే అవకాశం లేక సాగుకు పనికి రావడం లేదని తెలిపారు. పట్టాలు ఇచ్చిన భూముల్లో వేరేవారు సాగులో ఉంటున్నారని కమిషన్‌ దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారంపై ఎస్‌టి కమిషన్‌ దృష్టి సారించిందన్నారు. ఇప్పటికీ చాలా మంది గిరిజనులకు ఎస్‌టి కమిషన్‌ను ఎలా వినియోగించుకోవాలో తెలియడం లేదని పేర్కొన్నారు.

న్యాయం చేయాలని పాతనాతల గ్రామస్తుల వినతి

సుదీర్ఘకాలంగా సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, అధికారులు సర్వే చేసినా పట్టించుకోవడం లేదని తిరుపతి జిల్లా డక్కిలి మండలం పాతనాతల గ్రామానికి చెందిని ఎస్‌టిలు కమిషన్‌ ఛైర్మన్‌ శంకరరావును కలిసి వినతిపత్రం సమర్పించారు. 1984లో సర్వే చేసి భూములు కేటాయించినా ఇంతవరకు పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు ఆ భూములు వేరేవారివని చెబుతున్నారని అన్నారు. 70 ఏళ్ల వృద్ధురాలు కన్నీటి పర్యంతమయ్యారు. దీనికి స్పంచించిన ఛైర్మన్‌ వారికి తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

➡️