రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు

  •  రెండో రోజు 46 డిగ్రీల నమోదు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భానుడు భగ..భగమంటున్నాడు. రాష్ట్రంలో రెండో రోజు ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. బుధవారం పల్నాడు జిల్లా కొప్పునూరులో 46.2 డిగ్రీలు, తిరుపతి జిల్లా మంగనెల్లూరులో 46 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే ఎన్‌టిఆర్‌ జిల్లా చిల్లకల్లులో 45.8, నంద్యాల జిల్లా బనగానపల్లె, నెల్లూరు జిల్లా మర్రిపాడులో 45.7 డీగ్రీలు, చిత్తూరు జిల్లా కొత్తపల్లిలో 45.5, కడప జిల్లా సింహాద్రిపురంలో 44.9, బాపట్ల జిల్లా వల్లపల్లిలో 44.5, కర్నూలు జిల్లా పంచలింగాలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిగా మారింది. 79 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 118 మండలాల్లో వడగాడ్పులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం 31 మండలాల్లో తీవ్రగాడ్పులు, 234 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం వుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎమ్‌డి రోణంకి కూర్మనాథ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వడగాడ్పులు వీచే మండలాల్లో ప్రజలు అప్రమత్తంగా వుండాలని, అత్యవసరమైతేనే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన కోరారు.

➡️