కీలక పోస్టుల్లోని రిటైర్డు ఉద్యోగుల తొలగింపు

  • ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక శాఖల్లో పలువురు రిటైర్డు ఉద్యోగులు సేవలందించాలని గత ప్రభుత్వ ఉత్తర్వులను ప్రస్తుత ప్రభుత్వం గురువారం రద్దు చేసింది. అటువంటి వారిని వెంటనే తొలగించాలని, లేక తక్షణమే ఆయా ఉద్యోగుల నుంచి రాజీనామా పత్రాలు తీసుకోవాలని, హెచ్‌ఒడిలు, ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీలకు సిఎస్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రిటైర్డు ఉద్యోగుల తొలగింపులకు సంబంధించిన నివేదికను ఈ నెల 24లోగా ఇవ్వాలని కూడా ఆదేశించారు. ఉద్యోగ విరమణ చేసిన వారి సేవలు ఆ శాఖలో తప్పనిసరి అవసరమైతే నిబంధనలను అనుసరించి ప్రభుత్వం వద్ద నూతనంగా ఉత్తర్వులు పొందాలని సూచించారు. ఉద్యోగ విరమణ చేసిన వారు అత్యధికంగా పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, జలవనరులు, గృహ నిర్మాణశాఖల్లో పనిచేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అంతేకాకుండా ఆయా ఉద్యోగులకు నిబంధనలకు మించి వేతనాలు చెల్లిస్తున్నట్లు ప్రచారమూ జరుగుతోంది.

➡️