విద్యాహక్కు చట్టం కింద 25 వేల సీట్లు భర్తీ

  •  బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ అప్పారావు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేట్‌, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో అర్హులైన 25,125 మంది పిల్లలకు విద్యాహక్కు చట్టం కింద ఉచితంగా ప్రవేశాలు కల్పించినట్లు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు. పాఠశాలల యాజమాన్యాలు తప్పనిసరిగా వారికి ఎటువంటి ఫీజులూ వసూలు చేయకుండా ప్రవేశాలు కల్పించాలని సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాదిలో అత్యధిక సీట్లు గణనీయంగా పెరిగాయన్నారు. విద్యాహక్కు చట్టం పనితీరుపై విద్యాశాఖ సమన్వయంతో బాలల హక్కుల కమిషన్‌ పర్యవేక్షణ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ నియమ, నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని, ఉల్లంఘనకు పాల్పడిన విద్యాసంస్థలపై కమిషన్‌ ద్వారా శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ప్రవేశాలపై ఇబ్బందులు ఎదుర్కొంటే కమిషన్‌ కార్యాలయానికి apscpcr2018@gmail.com కు ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

➡️