‘రెవిన్యూ’రిటైల్‌ పెట్రోలియం అవుట్‌లెట్‌లు

Dec 7,2023 08:10 #Revenue Department
retail petroleum outlets

స్ధలాలను గుర్తించే పనిలో ఉద్యోగులు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎక్కడికక్కడే ఆదాయాన్ని సమకూర్చుకోవాలని రెవిన్యూశాఖ భావిస్తోంది. పై స్థాయి నుండి అందిన ఆదేశాల మేరకు ఈ దిశలో కసరత్తు జరుగుతోందని సమాచారం. ఇందులో భాగంగా కమర్షియల్‌ అవసరాలకు ఉపయోగపడే ప్రభుత్వ స్దలాలను జిల్లా కేంద్రాల్లో గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. గుర్తింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం ఆయా స్ధలాల్లో రెవిన్యూశాఖ ఆధ్వర్యంలో పెట్రోలియం అవుట్‌ లెట్‌లు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగల్‌ ఇచ్చింది. ఇదే తరహాలో ఇప్పటికే పోలీస్‌ శాఖ పెట్రోల్‌ బంక్‌లు నడుపుతోంది. అమ్మకాల ద్వారా వచ్చిన కమిషన్‌ను పోలీస్‌శాఖ సంక్షేమానికి ఉపయోగిస్తోంది. దీంతో ఆ శాఖకు స్థానికంగానే నిధులు సమకూరుతున్నాయి. అదే తరహాలో జిల్లా కేంద్రాల్లో పెట్రోల్‌ బంక్‌లు ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన అనంతరం నియోజకవర్గ కేంద్రాల్లో పెట్రోలియం అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా స్ధానికంగానే ఆదాయం సమకూర్చుకోవచ్చని రెవిన్యూశాఖ అంచనా వేస్తోంది. జిల్లా కేంద్రమైన కడపలో రెవిన్యూవెల్ఫేర్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌ పేరుతో ఇప్పటికే పెట్రోలియం అవుట్‌లెట్‌ను ప్రారంభించారు. ఇదే విధంగా రాష్ట్రమంతా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

➡️