పిఎసిఎస్‌ల్లో రిటైర్మెంట్‌ వయసు 62- హైకోర్టు కీలక తీర్పు

May 21,2024 22:58 #AP High Court, #judgement

ప్రజాశక్తి-అమరావతి :రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో (పిఎసిఎస్‌) పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లని హైకోర్టు స్పష్టం చేసింది. పిఎసిఎస్‌ల్లో రిటైర్మెంట్‌ వయసు 60 నుంచి 62 ఏళ్లుగా పరిగణించేలా ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వానికి తెలిపింది. ఉద్యోగుల్లో ఎవరైనా 60 ఏళ్లు నిండాక పదవీ విరమణ చేసి ఉంటే, ఇప్పటికి వాళ్ల వయసు 62 ఏళ్లు నిండకపోయి ఉంటే ఆ ఉద్యోగులను తిరిగి సర్వీసులోకి తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది. వాళ్లకు వేతన బకాయిలు చెల్లించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణప్రసాద్‌ ఇటీవల తీర్పు వెలువరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో ఆ ఉత్తర్వులను తమకు కూడా అమలు చేయాలని కోరుతూ పిఎసిఎస్‌ ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలను దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలని పిఎసిఎస్‌లు తీర్మానం చేశాయని పిటిషనర్లు హైకోర్టు దృష్టికి తెచ్చారు. సహకార సంఘాల రిజిస్ట్రార్‌ ఆ తీర్మానాలను ఆమోదించకపోతే వాటికి విలువ ఉండదని, ప్రభుత్వ అనుమతి విధిగా ఉండాలని, ఈ మేరకు గతంలో హైకోర్టు తీర్పులు ఇచ్చాయని ప్రభుత్వం వాదించింది. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ గత తీర్పులు ఇప్పటి కేసులకు వర్తించవని తెలిపారు.

➡️