పకడ్బందీగా పరీక్షల నిర్వహణ

విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదు :  విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

టెన్త్‌, ఇంటర్‌, టెట్‌, డిఎస్‌సిలపై సమీక్ష

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :    త్వరలో జరగనున్న పదో తరగతి, ఇంటర్మీడియట్‌, టెట్‌, డిఎస్‌సి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. విజయవాడలోని సమగ్రశిక్షా కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పరీక్షల ఏర్పాట్లపై కలెక్టర్లు, పోలీస్‌, వైద్య, రెవెన్యూ, విద్యుత్‌, రవాణశాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మార్చి అంతా పరీక్షలు జరగనున్నాయని, దాదాపు 20 లక్షల మంది వివిధ పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. మార్చి 1 ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌, 18 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయని చెప్పారు. అధికారులు ఏర్పాట్లను ముందుగానే పరిశీలించాలని ఆదేశించారు. సమన్వయంతో పనిచేసి పరీక్షలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌, కమిషనరు ఎస్‌ సురేష్‌కుమార్‌, ఇంటర్మీడియట్‌ కమిషనరు సౌరభ్‌ గౌర్‌ తదితరులు పాల్గన్నారు.

ఛేంజ్‌ ఇంక్‌తో పాఠశాల విద్య ఒప్పందం

నిర్దిష్ట అభ్యసన వైకల్యం (స్పెసిఫిక్‌ లెర్నింగ్‌ డిజిబిలిటీ) కోసం ఛేంజ్‌ ఇంక్‌ సంస్థతో మంత్రి బొత్స సమక్షంలో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. మధ్యాహ్న భోజన పథకం డైరెక్టరు శోభిక ఎస్‌ఎస్‌, ఛేంజ్‌ ఇంక్‌ సంస్థ ప్రతినిధి పూర్ణిత నంబియార్‌ ఒప్పందాలపై సంతకాలు చేశారు. సిబిఎస్‌ఇ పదో తరగతి పాఠ్యప్రణాళిక కరదీపికలను మంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో వెయ్యి ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్‌ఇ సిలబస్‌ అమలవుతుందని చెప్పారు. సిబిఎస్‌ఇ నిబంధనల ప్రకారం రూపొందించిన పాఠ్యప్రణాళికలు ఉంటే బోధనలో నూతనత్వం సంతరించుకుంటుందని తెలిపారు. జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్‌వర్క్‌ పాఠశాల విద్య (ఎన్‌సిఎఫ్‌ఎస్‌ఇ)లో వివరించిన పాఠ్య లక్ష్యాలు, సామర్ధ్యాలు, అభ్యాసన ఫలితాలను ప్రతిబింబించేలా ఉందన్నారు.

➡️