రోడ్లంటే చులకనే! 

Dec 20,2023 11:03 #amaravati, #National Highways
  •   జాతీయ రహదారులూ నత్తనడకనే

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో :    రోడ్ల నిర్మాణం అంటే రాష్ట్ర ప్రభుత్వానికే కాదు కేంద్రానికీ చిన్న చూపు మాదిరే కనిపిస్తోంది. రాష్ట్ర రహ దారులు, జిల్లా రహదారుల మాదిరే జాతీయ రహదారుల నిర్మాణ పనులూ కూడా నత్త నడకన నడుస్తున్నాయి.  గత ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పనులు కూడా ఇప్పుడు నత్తనడకన నడుస్తున్నాయి. రాయలసీమ జిల్లాల నుండి రాష్ట్ర రాజధాని  అమరావతికి అతితక్కువ సమయంలో చేరుకునేందుకు వంపులు లేని ఆరులైన్ల రోడ్డుగా చేపట్టిన అనంతపురాం అమరావతి ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణం దాదాపు నిలిచిపోయింది.  కేంద్రం ఈ రోడ్డును రూ.9వేల కోట్లతో ప్రతిష్టాత్మకంగా చేపడు తున్నట్లు ప్రకటించి ఇప్పుడు పక్కన పెట్టేసింది. ఆరువందల కిలోమీటర్ల దూరం వుండే ఈ జాతీయ రహదారిలో 390 కిలోమీటర్లు నాలుగులైన్లు, 210 కిలోమీటర్లు ఆరులైన్లతో 2017లో చేపట్టిన ఈ రోడ్డు పనులు రెండున్నర ఏళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిజైన్లను మార్చినా ఇప్పటికీ పనులు పూర్తికాని పరిస్థితి వుంది. ఈ ప్రాజెక్టులో కర్నూలు నుండి దోర్నాల వరకు వున్న 130 కిలోమీటర్ల రోడ్డు పనుల్లో ఆత్మకూరు వరకు మాత్రమే పనులు సాగుతున్నాయి.  మిగిలిన పనులు నిలిచిపోయాయి. నిత్యం రద్దీగా వుండే కెజి రోడ్డులో కుంట నుండి దోర్నాల వరకు ప్రస్తుతం ఉన్న సింగిల్‌ రోడ్డును రూ.250 కోట్లతో డబుల్‌రోడ్డుగా మార్చేందుకు టెండర్ల ప్రక్రియ పూర్తయినా పనులు మొదలు పెట్టని పరిస్థితి వుంది.

ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడ, గుంటూరు నుండి శ్రీశైలం వెళ్లే వారికి మెరుగైన ప్రయాణ సౌకర్యాన్నిస్తుంది. వినుకొండ నుండి గుంటూరు వరకు 90 కిలోమీటర్ల నాలుగులైన్ల రోడ్డు పనులు సర్వేలకే పరిమితమయ్యాయి. కోస్తా జిల్లాల్లో తీరప్రాంతాలను కలుపుతూ చేపట్టిన కత్తిపూడి ఒంగోలు జాతీయ రహదారి పని నాలుగేళ్లుగా సాగుతోంది. తీర ప్రాంత జిల్లాల్లో చెన్నై కలకత్తా రోడ్డుపై రద్దీని తగ్గించి వేగంగా రవాణా జరిగే ఈ ప్రాజెక్టు నత్తనడకన నడుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 8,690 కిలోమీటర్ల మేర 55 జాతీయ రహదారులు వున్నాయి. హైదరాబాద్‌ నుండి తిరుపతి దూరాన్ని తగ్గించేలా కొత్తపల్లి, వెలుగోడు, బండి ఆత్మకూరు, నంధ్యాల వరకూ చేపట్టిన జాతీయ రహదారి పనులు ఇప్పటిదాకా మొదలు పెట్టని పరిస్థితి వుంది. జాతీయ రహదారి 150సి సూరత్‌ నుండి చెన్నరు వరకు చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవే పనులు కూడా నత్తనడకన నడుస్తున్నాయి. జాతీయ రహదారుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా చేపట్టకపోవడంతో పనులు ఆలస్యమవుతున్నాయని ఎన్‌ఎహెచ్‌ఎఐ అధికారులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు భూముల విలువను మార్కెట్‌ రేట్ల ప్రకారం కాకుండా పూర్తిగా తగ్గించి ఇస్తామని చెబుతుండటంతో రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రాని పరిస్థితి వుంది. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే తప్ప రహదారుల నిర్మాణం పూర్తి కాదని అధికారులు చెబుతున్నారు.

➡️