సంస్కృత వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలి

– స్నాతకోత్సవ సభలో భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌
ప్రజాశక్తి – ఎస్‌వియు క్యాంపస్‌ (తిరుపతి జిల్లా) :సంస్కృత వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్కడ్‌ కోరారు. తిరుపతిలోని సంస్కృత వర్సిటీ మూడోస్నాతకోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. 580 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేశారు. ఇందులో 67 మంది విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. సంస్కృత పాఠ్యాంశాలను అభివృద్ధి చేయడం, ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించడం ద్వారా సంస్కృత వారసత్వాన్ని భవిష్యత్‌ తరాలకు అందించాలన్నారు. భారతీయ విజ్ఞాన వ్యవస్థలను తోసిపుచ్చే వలసవాద ఆలోచనా విధానం వల్ల ప్రధాన స్రవంతి విద్యలో సంస్కృత ఏకీకరణకు ఆటంకం ఏర్పడిందన్నారు. పురాతన రాతప్రతుల సంరక్షణ కోసం డిజిటల్‌ టెక్నాలజీ విభాగంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని కోరారు. ఏ భాష అయినా సమాజం వినియోగించి, సాహిత్యం కూర్చినప్పుడే మనుగడ సాగుతుందన్నారు. పరివర్తనకు సంస్కృతం మార్గమని, అమూల్యమైన వారసత్వానికి విద్యార్థులు రాయబారులుగా మారాలని కోరారు. విశ్వవిద్యాలయం ఛాన్సలర్‌ ఎన్‌.గోపాలస్వామి స్నాతకోత్సవాన్ని ప్రారంభించారు. వివిధ కోర్సుల్లో ఉపాధి పొందిన 580 మంది విద్యార్థులకు వైస్‌ఛాన్సలర్‌ ఉపస్థాపనం చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసర్స్‌ ఛాన్సలర్‌ గోపాలస్వామి, యూనివర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ కె.సాంబశివమూర్తి పాల్గొన్నారు.

➡️