మోడీ మతోన్మాద పాలనపై పోరాడాలి

seminar on lenin in wg

ప్రపంచ శ్రామిక వర్గ పీడిత విముక్తికి మార్క్సిజమే మార్గం

సీపీఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం

ఘనంగా సోవియట్ విప్లవ రథసారథి వి.ఐ.లెనిన్ శత వర్ధంతి సభ్

ప్రజాశక్తి-భీమవరం : ప్రపంచ కార్మిక వర్గ, కమ్యునిస్టు ఉద్యమ నాయకుడు, ఎర్రజెండా తొలివెలుగుల సోవియట్ విప్లవ రథసారథి వి.ఐ.లెనిన్ శత వర్ధంతి సభ సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భీమవరంలోని  ప్యాడి అండ్ రైస్ మర్చంట్స్ హాలులో ఘనంగా జరిగింది. తొలుత లెనిన్ చిత్రపటానికి మంతెన సీతారాం, పలువురు వక్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం అధ్యక్షతన సభ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మాట్లాడుతూ ప్రపంచ కార్మిక, శ్రామిక వర్గ విముక్తికి ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమే అని కొనియాడారు. జారు చక్రవర్తిని ఎదుర్కొని ప్రపంచంలో మొట్టమొదటిసారి సోవియట్ యూనియన్ ని సాధించిన ఘనత లెనిన్ దే అన్నారు. ప్రపంచ చరిత్ర గతిని మార్చిన మహనీయుడు లెనిన్ అన్నారు. ఒక జాతి, మరొక జాతిని, ఒక మనిషి, మరొక మనిషిని దోచుకునే పద్ధతిని నిర్మూలించిన మహోన్నత వ్యక్తి లేని అని కొనియాడారు. ప్రజల బాధలకు పెట్టుబడి దారీ విధానమే కారణం అని సోషలిజమే సమస్యలకు పరిష్కారం అని తెలిపారు. దేశంలో నిరుద్యోగం, పేదరికం, అసమానతలను, ప్రస్తుత పెట్టుబడి దారీ పాలకులు పరిష్కారం చూపలేరని అన్నారు. ఎర్రజెండా రాజ్యంలోనే ప్రజలు భూలోకంలోనే స్వర్గాన్ని చూస్తారని చెప్పారు.
అనంతరం సాహితీ వేత్త, రచయిత కె.కుమార్ మాట్లాడుతూ ప్రపంచంలో సాధించిన విప్లవాలకు లెనిన్ ఒక ఒక దిక్సూచి అన్నారు. జారు చక్రవర్తి నియంతృత్వంలో నలిగిపోయిన రష్యా విముక్తికి లెనిన్ నాయకత్వంలో సోవియట్ యూనియన్ విప్లవం సాధించిందని తెలిపారు. లెనిన్ జీవితం నేటి విప్లవాలకూ స్ఫూర్తి అన్నారు. రష్యాలో జారు చక్రవర్తికి వ్యతిరేకంగా సాహిత్యాలు ఒకవైపు, పెట్టుబడి దారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు మరోవైపు ముమ్మరంగా సాగాయన్నారు. సోవియట్ విప్లవం అనంతరం ప్రపంచ వ్యాప్తంగా కార్మిక వర్గ భావజాలాన్ని వ్యాప్తి చేస్తే మన దేశంలో ఆర్.ఎస్.ఎస్ భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేసేలా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. రామాయణం పేరుతో ప్రజల విశ్వాసాన్ని కూడా మోడీ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు. ప్రజల్లో లౌకిక వాదాన్ని పెంపొందించేలా విప్లవ సాహిత్యాన్ని ప్రచారం చెయ్యాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ కార్మిక వర్గ విప్లవానికి నిర్మాణం కీలకమని దానిని లెనిన్ నిర్మించాడని తెలిపారు. కార్మిక వర్గ ఐక్యతను చాటిచెప్పేలా కార్మిక, కర్షకుల ఐక్యతను లెనిన్ ఆదర్శంగా సాధించారాన్నారు. ప్రతీ కార్యకర్త క్రమశిక్షణగా నిలవాలనేది లెనిన్ నుంచే నేర్చుకోవాలని తెలిపారు. కర్తవ్య నిర్వహణలో లెనిన్ జీవితం స్ఫూర్తి అని, కమ్యూనిస్టుకు నిలువెత్తు రూపం అన్నారు. నియంతృత్వ పాలనకు సాగించే జారు చక్రవర్తిని తుదిముట్టించిన ఘనత లెనిన్ కి చరిత్రలో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. పోరాటాలు నడిపే క్రమంలో కుటుంబ సభ్యులను కోల్పోయినా , వచ్చే కష్టాలను కూడా అధిగమించి విప్లవాన్ని సాధించారని గుర్తుచేశారు. లెనిన్ విప్లవ స్పూర్తితో దేశంలో ప్రజాతంత్ర విప్లవాన్ని సాధించేలా ప్రజలందరూ ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ మార్క్స్, లెనిన్ స్పూర్తితో కార్మిక వర్గానికి, ప్రజా బాహుళ్యానికి విప్లవ భావజాలాన్ని అందించాలన్నారు. దేశంలో బిజెపి ప్రభుత్వం ప్రజల మధ్య కుల, మత ఘర్షణలను సృష్టిస్తుందని మండిపడ్డారు. దోపిడీ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలంటే మార్క్సిజమే ఏకైక మార్గమన్నారు. ప్రస్తుతం మోడీ దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సంపాదన కాపాడుకోవాలంటే కార్మిక వర్గానికి ఐక్యం చేసి ఐక్య ఉద్యమాలు చేపట్టాలన్నారు. అలాంటి ఐక్యతే సోవియట్ యూనియన్ విప్లవం సాధించిందని తెలిపారు. ప్రతీ విప్లవానికి నాయకత్వం వహించేది దేశంలో ఉన్న కార్మిక వర్గమే అని అన్నారు. ప్రజలందరూ సోషలిస్టు , కమ్యూనిజ భావజాలాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.
సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జే.ఎన్.వి. గోపాలన్ మాట్లాడుతూ ప్రపంచంలో విప్లవాలకు నాయకత్వం వహించిన వారిలో రెండవ అగ్రశ్రేణి నాయకుడు లెనిన్ అని కొనియాడారు. ప్రపంచంలోనే నిస్వార్థపూరితమైన గొప్ప మానవతా వాది లెనిన్ అన్నారు. నేటి యువతకు లెనిన్ జీవితం ఒక అదర్శనీయమన్నారు. విప్లవంలో ప్రజల్ని చైతన్య పరచడమే కాకుండా వారి సమస్యల పరిష్కారం కోసం మహోత్తర పోరాటం సాగించిన విప్లవ వీరుడు లెనిన్ అని అన్నారు. విప్లవం సాధించిన దేశాల్లో ప్రభుత్వాల పాలన ప్రజల సంక్షేమం కోసం ఉంటాయని కోవిడ్ కాలంలో రుజువయ్యిందన్నారు. కొవిడ్ లో పెట్టుబడి దారీ దేశాల్లో లక్షలాది మంది ప్రజలు మరణిస్తే సోషలిస్టు దేశాల్లో ప్రజల ప్రాణాలను కాపాడారని గుర్తుచేశారు. ప్రతీ విప్లవ కారుడికి భావోద్వేగం ఉంటుందని లెనిన్ జీవితం తెలియజేసిందన్నారు. రష్యాలో విప్లవం సాధించాక కూడా నిరాడంబర జీవితాన్ని గడిపిన గొప్ప విప్లవ యోధుడు లెనిన్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.వాసుదేవరావు, డి.కళ్యాణి, పివి ప్రతాప్, కర్రి నాగేశ్వరరావు, కేతా గోపాలన్, జిల్లా కమిటీ సభ్యులు కె.రాజారామ్మోహన్ రాయ్, ఎ.అజయ కుమారి, జుత్తిగ నరసింహ మూర్తి, జక్కంశెట్టి సత్యనారాయణ, గొర్ల రామకృష్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

➡️