నీట్‌ ఆరోపణలపై సమగ్ర విచారణకు ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌

Jun 10,2024 22:04 #neet exam, #SFI

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నీట్‌ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎ అశోక్‌, కె ప్రసన్నకుమార్‌ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్‌ యుజి-2024 ఫలితాల్లో హర్యానాకు చెందిన ఒకే పరీక్షా కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం, వారందరికీ 720/720 మార్కులు రావడం ఎన్నో అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ఎంతో మంది విద్యార్థులకు సాధ్యం కాని విధంగా 718, 719 మార్కులు వచ్చాయని వివరించారు. నీట్‌ వివాదంపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని పేర్కొన్నారు. జూన్‌ 14న ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించి, జూన్‌ 4నే విడుదల చేశారని, దీనిపై అనేక సందేహాలు ఉన్నాయని తెలిపారు. విద్య వికేంద్రీకరణలో భాగంగా నీట్‌ పరీక్షను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి విద్యను ప్రైవేటీకరణ చేస్తుందని విమర్శించారు. దేశం మొత్తం ఒకే పరీక్ష ఉండాలని విద్యార్థులపై ఒత్తిడిని పెంచిందని, ఇది పూర్తిగా రాష్ట్రాల హక్కులను కాలరాయడమే అవుతుందని అన్నారు. ఎన్‌టిఎ నిర్వహించిన అన్ని పరీక్షలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నిర్వహణలో వైఫల్యం చెందినందుకు ఏజెన్సీని రద్దు చేయాలని కోరారు.

➡️