వైఎస్‌ భారతిపై షర్మిల ఫైర్‌

  • అందరిని గొడ్డలితో నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ అంటూ విమర్శ

ప్రజాశక్తి-కడప : కడపలో వైసిపి సింగిల్‌ ప్లేయర్‌ అంటూ ఇటీవల సీఎం జగన్‌ సతీమణి వైఎస్‌ భారతి చేసిన వ్యాఖ్యలపై షర్మిల మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. ఎప్పుడూ సింగిల్‌ ప్లేయర్‌గా వాళ్లే అధికారంలో ఉండాలనేది వైఎస్‌ భారతి వ్యూహం అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గొడ్డలితో మిగతా వాళ్లను అందరిని నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్‌ ప్లేయర్‌గా ఉంటారని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. ఇక, ఓటమి భయంతో కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌ రెడ్డి ఊరుదాటేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. దేశం విడిచి వెళ్లేందుకు అతడు పాస్‌ పోర్టులు కూడా సిద్ధం చేసుకున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వైసీపీ ఓడితే అరెస్ట్‌ తప్పదని భయంతో అవినాష్‌ రెడ్డి ఉన్నాడని అన్నారు. ఒకవేళ అవినాష్‌ రెడ్డి ఎంపీగా గెలిస్తే నేరం గెలిచినట్లేనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కడప ప్రజలకు నిత్యం ఎంపీ అందుబాటులో ఉండాలంటే తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మోడీకి రేడియోను గిఫ్ట్‌గా పంపిన షర్మిల
ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీసీసీ చీఫ్‌ షర్మిల రేడియోను గిఫ్ట్‌గా పంపారు. ”రాష్ట్ర ప్రజల మన్‌ కీ బాత్‌ను మోడీ వినాలి. ప్రత్యేక హౌదా, స్టీల్‌ ప్లాంట్‌, పోలవరం, కడప ఉక్కు కర్మాగారం వంటి అంశాల్లో చేసిన అన్యాయంపై ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇసుక, మద్యం, ఖనిజ అక్రమాలు జరుగుతున్నా కేంద్రం నుంచి చర్యలు లేవు. వివేకా హత్య కేసులో కేంద్రం పట్టనట్లు వ్యవహరించడం యావత్‌ దేశానికి అవమానం.” అని షర్మిల ధ్వజమెత్తారు.

➡️