షర్మిల వెంటే ఉంటా : ఎమ్మెల్యే ఆళ్ల

Dec 30,2023 12:35
  • పార్టీ నుంచి పొమ్మనలేక పొటబెట్టారని ఆరోపణ

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ సోదరి వైఎస్‌ షర్మిలతోనే రాజకీయ ప్రయాణం చేస్తానని వైసీపీకి రాజీనామా చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) వెల్లడించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను పార్టీ నుంచి పొమ్మనలేక పొటబెట్టారని వైసీపీపై ఆరోపణలు చేశారు. రూ.1200 కోట్లతో అభివద్ధి చేస్తామని చెప్పి రూ.120 కోట్లను మాత్రమే కేటాయించారన్నారు. చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను ఓట్లు ఎలా అడగాలని ప్రశ్నించారు. అందుకే, తన సొంత డబ్బులతో కొన్ని పనులు చేసినట్లు వివరించారు. టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్‌ను ఓడించిన తనను పార్టీ పెద్దలు పట్టించుకోలేదని చెప్పారు. నైతిక విలువలను పాటించే నేతగా పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చానని తెలిపారు. అందువల్లే వైసీపీకి రాజీనామా చేశానని, ఇకపై వైఎస్‌ షర్మిలతోనే కలిసి నడుస్తానని వివరించారు. అలాగే చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తాని.. వైసిపి ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనని. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయస్థానాలు తేలుస్తాయన్నారు.

➡️