టిటిడి ఇఒగా శ్యామలరావు బాధ్యతలు స్వీకరణ

ప్రజాశక్తి – తిరుమల :తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఇఒగా జె.శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి ముందుగా వరాహ స్వామిని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పద్మావతి అతిథిగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇఒగా రావడం తన అదృష్టమని అన్నారు. టిటిడిలో ప్రతిదీ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. సందర్శకుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. సందర్శకులకు సంతృప్తికర దర్శనం కల్పించడమే తన లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌తో తిరుమలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. టిటిడి నిధులు దుబారా కాకుండా సక్రమంగా వినియోగిస్తామని చెప్పారు. గతంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేపడుతామని తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

➡️