ఎస్‌ఐ పోస్టులకు 18,637 మంది అర్హత

Dec 7,2023 07:24 #AP police, #post
si posts police merit list

త్వరలో మెరిట్‌ జాబితా విడుదల
ఎస్‌ఎల్‌పిఆర్‌బి ఛైర్మన్‌ అతుల్‌ సింగ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం అక్టోబరులో నిర్వహించిన మూడు, నాలుగు పేపర్‌లకు పరీక్షలు రాసిన వారిలో మొత్తం 18,637 మంది అర్హత సాధించారని, త్వరలో మెరిట్‌ జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్టు ఛైర్మన్‌ అతుల్‌సింగ్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎస్‌ఐ ఫలితాలను బుధవారం విడుదల చేశారు. ఎస్‌ఐ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌తో మొత్తం 1,73,047 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. వీరికి ఫిబ్రవరి 19న ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 1,51,288 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షలకు హాజరైన వారిలో 57,923 మంది అర్హత సాధించారని తెలిపారు. ఇందులో దేహదారుఢ్య పరీక్షల అనంతరం 31,193 మంది అర్హత సాధించారని, వీరికి అక్టోబరు 14, 15 తేదీల్లో పేపర్‌ 3, 4 పరీక్షలను నిర్వహించామన్నారు. ఇందులో 18,637 మంది అర్హత సాధించారని, ఇందుకు సంబంధించి పరీక్షల కీని విడుదల చేస్తున్నామని తెలిపారు. 3, 4 పేపర్లను రాసిన అభ్యర్థులంతా ఎస్‌ఎల్‌పిఆర్‌బి వెబ్‌సైట్‌లో ఫలితాలకు సంబంధించి కీని చూసుకోవచ్చన్నారు. ఈ వెబ్‌సైట్‌ ఈ నెల 8 వరకు అందుబాటులో వుంటుందని తెలిపారు. ఎస్‌ఐ పోస్టులకు సంబంధించి మెరిట్‌ జాబితాను త్వరలో విడుదల చేస్తామన్నారు.

➡️