సిట్‌ దర్యాప్తు ముమ్మరం

  • పల్నాడు, అనంతపురం జిల్లాల్లో కొనసాగింపు
  • తిరుపతి జిల్లాలో ప్రారంభం
  • నేడు ఇసికి నివేదిక

ప్రజాశక్తి- యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ, ఆ తర్వాతా రాష్ట్రంలో జరిగి హింసాత్మక ఘటనలపై ఏర్పాటైన ప్రత్యే దర్యాప్తు బృందం (సిట్‌) విచారణను వేగవంతం చేసింది. పల్నాడు, అనంతపురం జిల్లాల్లో శనివారమే విచారణ ప్రారంభం కాగా, తిరుపతిలో ఆదివారం ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో 13 మంది అధికారులతో ఏర్పాటైన సిట్‌ బృందం తన నివేదికను ఎన్నికల కమిషన్‌కు సోమవారం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఎవరెవరిపై వేటు పడనుందో, ఎవరెవరిని బాధ్యులు చేయనుందో అనే ఉత్కంఠ నెలకొంది. దాడులతో సంబంధం ఉన్న వారు కొందరు ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి శనివారం రాత్రి చేరుకున్న సిట్‌ బృందం సభ్యులు డిఎస్‌పి శ్రీనివాసులు, ఎసిబి డిఎస్‌పి భూషణం, ఎసిబి ఇన్‌స్పెక్టర్‌ జిఎల్‌.శ్రీనివాస్‌ ఆదివారం సాయంత్రం వరకు దర్యాప్తు కొనసాగించారు. తాడిపత్రిలో రాళ్ల దాడులు జరిగిన ప్రాంతాలను శనివారం రాత్రి పరిశీలించారు. ఓంశాంతి నగర్‌, పాతకోట, గానుగ వీధిలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు. ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్‌ ఇళ్ల పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇరుగ్రూపులూ గొడవపడిన తాడిపత్రిలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో కలియతిరిగారు. రాళ్ల దాడి ఏ విధంగా జరిగిందో ఆరా తీశారు. ఆదివారం పట్టణ పోలీస్‌ స్టేషనలో పలు రికార్డులను పరిశీలించారు. డిఐజి షిమోషీతో సమావేశమయ్యారు. తాడిపత్రిలో జరిగిన రాళ్ల దాడులు, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ జెసి.ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద జరిగిన హింసాత్మక ఘటనలు, పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు. అనంతరం రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ రికార్డులను పరిశీలించారు. బందోబస్తు సిబ్బందితో మాట్లాడారు. సిట్‌ అధికారులు ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి, వివరాలు నమోదు చేసుకున్నారు.

సిట్‌ అధికారులకు ఎమ్మెల్యే భార్య వినతి
పోలింగ్‌ అనంతరం మే 14న జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే నివాసం, కార్యాలయంలో పలు వస్తువులను ధ్వంసం చేశారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్య రమాదేవి సిట్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. పోలీసులు తమ కార్యాలయంలోకి ప్రవేశించి సిసి కెమెరాలు, కంప్యూటర్‌ హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేశారని, ఫర్నిచర్‌ను విరగొట్టారని, అక్కడున్న వారిపై అకారణంగా దాడి చేశారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. వీటిన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్‌ అధికారులను కోరారు.

చంద్రబాబు, లోకేష్‌, జెసి ప్రభాకర్‌రెడ్డి కారణం : వైసిపి జిల్లా లీగల్‌ సెల్‌ ఫిర్యాదు
తాడిపత్రిలో జరిగిన ఘర్షణలకు టిడిపి నాయకులు చంద్రబాబు, లోకేష్‌, తాడిపత్రి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి తండ్రి జెసి ప్రభాకర్‌రెడ్డి కారణమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని వైసిపి జిల్లా లీగల్‌ సెల్‌ అధ్యక్షులు ఉమాపతి సిట్‌ అధికారులను కోరారు.

చంద్రగిరిలో గొడవలపై ఆరా
శనివారం రాత్రి తిరుపతికి చేరుకొన్న సిట్‌ బృందం ఆదివారం ఉదయాన్నే విచారణ ప్రారంభించింది. డిఎస్‌పి రవి మనోహరాచారి నేతృత్వంలో సిఐ ప్రభాకర్‌రెడ్డి, మరి కొంతమంది సిబ్బందితో కూడిన బందం తిరుపతిలోని ఎస్‌వియు క్యాంపస్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. మహిళ యూనివర్సిటీలో జరిగిన గొడవలపై పోలీసుల వద్ద ఉన్న సమాచారాన్ని సేకరించింది. ఈ ఘటనపై పోలీసులు నమోదు చేసిన కేసులు, సెక్షన్ల వివరాలను పరిశీలించింది. అనంతరం చంద్రగిరి నియోజకవర్గంలోనికూచువారిపల్లికి వెళ్లింది. పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించి, అక్కడి సిబ్బందిని ప్రశ్నించింది. అక్కడి నుంచి కూచువారుపల్లి రామిరెడ్డిపల్లికి వెళ్లి ఆ రోజు జరిగిన అల్లర్లపై స్థానికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుంది. మరికొన్ని ప్రాంతాలను సందర్శించి, ఇంకొన్ని వివరాలు సేకరించింది.

పల్నాడులో పూర్తయిన విచారణ

సత్తెనపల్లి సిఐపై మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు
పల్నాడు జిల్లాలో సిట్‌ తన ప్రాథమిక విచారణను పూర్తి చేసింది. నరసరావుపేటలో శనివారం అర్ధరాత్రి వరకు ఎఎస్‌పి సౌమ్యలత విచారణ చేసి తిరిగి ఆదివారం రెండో రోజూ కొనసాగించారు. నరసరావుపేట రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ముగ్గురు సిఐలు, ఎస్‌ఐలను ఆమె విచారించారు. ఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించారు. వీడియోలను చూశారు. ఘర్షణలకు సంబంధించి నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు పరిశీలించి ఇంకా మార్పులు ఏమైనా చేయాలా? కొత్త నిందితులను ఎవరినైనా చేర్చారా? అని అడిగారు. నమోదైన కేసుల్లో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి వివరాలు, దాడులు, ప్రతిదాడులు, వాహనాల ధ్వంసం, దగ్ధం ఘటనల వివరాలు తెలుసుకున్నారు. ఘర్షణల్లో పాల్గొన్న వ్యక్తులు, వారి గతం, ఆస్తి నష్టం, శాంతిభద్రతల సమస్య ఏర్పడితే తీసుకున్న చర్యల వివరాలను నమోదు చేశారు. నరసరావుపేటలో విచారణ జరుపుతున్న సమయంలో ఎఎస్‌పి సౌమ్యలతను మంత్రి అంబటి రాంబాబు కలిసి సత్తెనపల్లి రూరల్‌ సిఐపై ఫిర్యాదు చేశారు. టిడిపి వారికి అనుకూలంగా వ్యవహరించి పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలసత్వం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సిట్‌ అధికారులను కోరినట్లు మీడియాకు చెప్పారు. సత్తెనపల్లి మండలం తొండపి గ్రామంలో క్షిణించిన శాంతిభద్రతలను పునరుద్దరించి ప్రశాంత వాతావరణం కల్పించి ప్రజాజీవనం సాఫీగా జరిగేలా చూడాలని పోలీస్‌ అధికారులను కోరారు. కారంపూడిలో సిట్‌ అధికారి డిఎస్‌పి రమణమూర్తి రికార్డులను పరిశీలించారు. సిఐ నారాయణస్వామి నుంచి వివరాలు సేకరించారు. ఈ నెల 14న జరిగిన ఘర్షణల వీడియోలను పరిశీలించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులు, అరెస్టులు, ఇంకా ఎంతమందిని అరెస్టు చేయాలన్న అంశంపై చర్చించారు. మాచర్ల, గురజాల నియోజకవర్గాల్లో జరిగిన ఘర్షణలపై విచారణ చేశారు. దాచేపల్లి, మాచవరం మండలంలో పోలింగ్‌ రోజు జరిగిన అల్లర్లపై దాచేపల్లి పోలిస్‌ స్టేషన్‌లో నమోదైన కేసు వివరాలను దాచేపల్లి సిఐ సురేంద్రబాబు నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిడిపి, వైసిపి వారు ఇచ్చిన వేర్వేరు ఫిర్యాదులు, ఎఫ్‌ఐఆర్‌లను పరిశీలించారు.

➡️