ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

Dec 12,2023 12:26 #Komati Reddy Venkat Reddy
  • తెలంగాణ భవన్‌ నిర్మాణంపై మార్చిలోపు నిర్ణయం

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర విభజన సందర్భంగా ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ హామీ ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతానని చెప్పారు. పొరుగు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే విషయంలో తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణంపై మార్చిలోపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి.. అనంతరం దానిపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ భవన్‌ ఆస్తుల వివరాలను, తెలంగాణకు రావాల్సిన వాటాను మ్యాప్‌ ద్వారా అధికారులు వివరించారు. అనంతరం ఉమ్మడి ఏపీ భవన్‌లోని పలు బ్లాక్‌లను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఏపీ భవన్‌కు చెందిన 19 ఎకరాలను పరిశీలించామన్నారు. ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమైందని ఉమ్మడి ఏపీ భవన్‌ విషయంలో 2 రాష్ట్రాల మధ్య వివాదం లేదన్నారు. 58:42 రేషియోలో పంపకాలు ఉంటాయన్నారు. డిజైన్లు, ఖరారు చేసి టెండర్లు పిలిచి ఏప్రిల్‌ నాటికి తెలంగాణ భవన్‌ నిర్మాణ పనులు చేపట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయాన్ని హైదరాబాద్‌ వెళ్లాక సీఎంతో చర్చిస్తానన్నారు.

➡️