మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా పెట్టలేదేం?

Apr 30,2024 23:06 #Chalasani Srinivas, #Pressmeet
  •  ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : ఓట్ల కోసం రకరకాల హామీలతో మేనిఫెస్టోలను విడుదల చేసిన వైసిపి, టిడిపి… ప్రత్యేక హోదా అంశాన్ని వాటి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదని ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌ ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని ఒక హోటల్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా, విభజన హామీలను ఈ రెండు పార్టీలూ అటకెక్కించాయన్నారు. మోడీ వద్ద జగన్‌, చంద్రబాబు తలవంచి రాష్ట్ర ప్రయోజనాలను, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని విమర్శించారు. మోడీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రూ.తొమ్మిది లక్షల కోట్లను కేటాయించి, దేశ సంపదనంతా అక్కడికే తరలిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని అమరావతి, తిరుపతి, విశాఖకు మాత్రం నిధులు ఇవ్వలేదన్నారు. ఇంటింటికీ గ్యాస్‌ ఇస్తామని చెప్పిన మోడీ… కృష్ణా బేసిన్‌లోని గ్యాస్‌ను గుజరాత్‌ వ్యాపారులకు పంపిస్తున్నారని వివరించారు. ప్రత్యేక హోదా లేకపోవడంతో పరిశ్రమలు రాక రాష్ట్రంలోని యువత వలసపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి దగా చేసిన వారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. ఈ సమావేశంలో ఆంధ్రా మేధావుల ఫోరం అధ్యక్షులు ప్రొఫెసర్‌ జి.అప్పలనాయుడు, రాష్ట్ర యువజన జెఎసి అధ్యక్షులు పి.బుల్లిరాజు, శ్రామిక వికాస్‌ సంఘటన జాతీయ ప్రధాన కార్యదర్శి వై.నారాయణ, పర్యావరణ ఉద్యమకారుడు శివరావు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి జిల్లా అధ్యక్షులు గొలివి నర్సునాయుడు పాల్గొన్నారు.

➡️