Special Status: ప్రత్యేక హోదాపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలి – రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా పనిచేయాలని, రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం లాంటి విభజన హామీల సాధనను ప్రాధాన్యతా అంశాల్లో చేర్చాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యాన ఆదివారం విజయవాడలోని బాలోత్సవ్‌ భవన్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడారు. ప్రత్యేక హోదా అనేది ఎన్నటికీ ముగిసిన అధ్యాయం కాదని, ఇది సజీవ సమస్యగా ఉందని అన్నారు. కేంద్ర మంత్రులు, ఎంపిలు కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని కోరారు. అలాగే వైసిపి ఎంపిలు రాజ్యసభలో హోదాపై తీర్మానం చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని, దానికి ప్రతిపక్షం కూడా సానుకూలంగా స్పందించాలన్నారు. పదేళ్లుగా రాష్ట్రానికి బిజెపి చేసిన అన్యాయాన్ని తెలుగు ప్రజలు మర్చిపోలేదని, ఇప్పటికీ గమనిస్తూనే ఉన్నారని అన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి ఎంపిలంతా బిజెపి అభ్యర్థులపైనే గెలుపొందారని గుర్తు చేశారు. టిడిపి ఎంపిలు లోక్‌సభలో, వైసిపి ఎంపిలు రాజ్యసభలో కీలకంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఇదే మంచి అవకాశమని అన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. అలాగే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం ప్రకటిస్తే వైసిపికి 36 మంది ఎంపిలు వున్నా జగన్‌మోహన్‌రెడ్డి తన కేసులకు భయపడి ప్రధాన మంత్రికి వినతిపత్రం ఇవ్వలేకపోయారని విమర్శించారు. విశాఖ రైల్వేజోన్‌, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ ఫ్యాక్టరీని సాధించుకోవాల్సి ఉందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ.. హోదా కోసం రాష్ట్రంలో 2014 నుండి పోరాటం జరుగుతోందన్నారు. చంద్రబాబు, జగన్‌ ఇద్దరూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. చంద్రబాబు కూడా కక్ష సాధింపు చర్యలు చేపడితే జగన్‌కు చంద్రబాబుకు తేడా ఉండదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు, జైభారత్‌ పార్టీ అధ్యక్షులు లకీëనారాయణ, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు, జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఏకగ్రీవ తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. వాటిని మరోసారి తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని కోరారు. రాష్ట్రంలో మీడియాపై అప్రకటిత నిషేధం సరైందికాదన్నారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్‌, సాధన సమితి జిల్లా కన్వీనర్‌ దోనేపూడి శంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు నరహరిశెట్టి నరసింహారావు, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు, చేతివృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ భాస్కరయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య తదితరులు పాల్గన్నారు.

➡️