డాక్టర్‌ కేసులో విచారణ వేగవంతం

May 1,2024 21:26 #police, #suside, #Vijayawada
  • వాయిస్‌ రికార్డ్‌ స్వాధీనం
  • ఆస్పత్రిని పరిశీలించిన పోలీసులు

ప్రజాశక్తి- విజయవాడ అర్బన్‌ : విజయవాడ నగరంలోని ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌ ఆత్మహత్య, కుటుంబ సభ్యుల హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. విజయవాడ పటమట పోలీసులు బుధవారం శ్రీనివాస్‌ సొంతంగా పుష్పా హోటల్‌ సెంటరులో ఏర్పాటు చేసుకున్న శ్రీజ హాస్పిటల్‌ను పరిశీలించారు. ఆస్పత్రి సిబ్బంది నుండి వివరాలు సేకరించారు. డాక్టర్‌ శ్రీనివాస్‌ గదిని, కంప్యూటర్‌ను, ఆయన కారులో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లనూ పరిశీలించారు. కారులో రూ.16 లక్షల నగదుతోపాటు 300 గ్రాముల బంగారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో శ్రీజ ఆస్పత్రిని ఇటీవలే మరో ఆస్పత్రి యాజమాన్యానికి అప్పగించారు. ఆస్పత్రిని ఎందుకు ఇచ్చారు? ఏ విధమైన లావాదేవీలు జరిగాయనే విషయమై విచారణ జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో విచారణ కొలిక్కివచ్చే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు.

ఒత్తిడికి తలొగ్గి కుటుంబాన్ని కడతేర్చి..
‘నా మానసిక పరిస్థితి బాగోలేదు. చాలా ఒత్తిడిలో ఉన్నా. అమ్మ, భార్య, పిల్లలంటే నాకు ప్రాణం. నేను చనిపోయాక వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే ఇలా చేశాను’ అని డాక్టర్‌ శ్రీనివాస్‌ తన ఫోన్లో రికార్డు చేసిన వాయిస్‌ను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అక్కడక్కడే తిరిగిన జాగిలం
కుటుంబ సభ్యులను చంపేందుకు ఉపయోగించిన కత్తులను సమీప సూపర్‌ మార్కెట్లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించి అక్కడి సిసి కెమెరాల దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలం వద్ద పోలీసు జాగిలం శ్రీనివాస్‌ ఇంటి నుంచి బయటకు వచ్చి, ఎదురుగా ఉన్న ఇంట్లోకి వెళ్లి బయటకు వచ్చింది. ఆ తర్వాత రోడ్డు పక్కన నిలిపిన కారు వద్దకు వచ్చి మళ్లీ వెనుదిరిగింది. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సిపి కెమెరాల్లో దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.

అంత్యక్రియలు పూర్తి
వైద్యుడు శ్రీనివాస్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యుల మృతదేహాలకు నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బుధవారం మధ్యాహ్నం బంధువులకు అప్పగించారు. అనంతరం కృష్ణలంక స్వర్గపురిలో అంత్యక్రియలు నిర్వహించారు. చివరిసారిగా శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులను చూసేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చారు.

➡️