పర్మినెంట్ చేయాల్సిందే…

ssa employees protest

8వ రోజు కొనసాగిన ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల సమ్మె

వివిధ రూపాల్లో నిరసనలు

కొనసాగుతున్నసమగ్ర ఉద్యోగుల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం : తమను రెగ్యులర్‌ చేయాలని హెచ్‌ఆర్‌, డిఎ ఇవ్వాలని, ప్రతి నెలా ఒకటో తేదీన కచ్చితంగా జీతాలివ్వాలని డిమాండ్‌ చేస్తూ సర్వశిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నిరసనలు కొనసాగించారు. వేతనంతో కూడిన మెడికల్‌ లీవులు మంజూరు చేయాలని, మెరుగైన హెల్త్‌ స్కీములు అమలు చేయాలని నినదించారు. ఈ నేపథ్యంలో పలువురు వక్తలు మాట్లాడుతూ ఎనిమిది రోజులుగా పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వంలో ఎలాంటి చలనమూ లేదని, ఉద్యోగుల కనీస అవసరాలు తీర్చలేని స్థితిలో ఉందని విమర్శించారు రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ఉద్యోగులు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఉద్యోగుల సమస్యలు అజెండాడగా ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో ఆ పార్టీకే మద్దతివ్వాలని సూచించారు.. ఓట్‌ ఫర్‌ రెగ్యులర్‌ నినాదంతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షలు చేపట్టారు. అల్లూరి జిల్లా పాడేరులో ఆందోళన చేపట్టారు. వారి పోరాటానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె లోకనాథం మద్దతు తెలిపారు. శ్రీకాకుళంలో జ్యోతిరావు ఫూలే పార్కు వద్ద సమ్మె శిబిరాన్ని నిర్వహించారు. అంతకుముందు పొట్టి శ్రీరాములు కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. కర్నూలు ధర్నా చౌక్‌లో డప్పు కళాకారులు డప్పుల దరువు మోగించి సంఘీభావం తెలిపారు. నంద్యాలలో బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం దగ్గర మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహిస్తున్న సమ్మెకు ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలియజేశారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఒంగోలు ప్రకాశం జిల్లాలో అర్ధ నగ ప్రదర్శన చేశారు. మహిళా ఉద్యోగులు కోలాటం ప్రదర్శించారు. బాపట్లలో సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే కోన రఘుపతికి వినతి పత్రం అందజేశారు. నెల్లూరు జిల్లాలో చేపట్టిన సమ్మెకు మద్దతుగా యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి బాబు రెడ్డి మాట్లాడారు. ఏలూరులోని కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు యుటిఎఫ్‌ నాయకులు మద్దతు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని పలు సంఘాల నేతలు సందర్శించి సంఘీభావం తెలియజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డిఇఒ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరాన్ని కొనసాగించారు. కాకినాడ డిఇఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. డిఇఒ, కలెక్టర్లకు వినతిపత్రాలను అందించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో డిఇఒ కార్యాలయం వద్ద ప్లకార్డులతో నిరస తెలిపారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరానికి సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగారావుకు వినతి పత్రం అందజేశారు. తిరుపతి కార్పొరేషన్‌, చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరం కొనసాగింది.గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరాన్ని సంద్దర్శించి రాష్ట్ర ఐటిఐ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, ఎపి ఎన్‌జిఒ నాయకులు మద్దతు తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో సమ్మె శిబిరం కొనసాగింది. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. సత్యసాయి జిల్లా కేంద్రం పుట్టపర్తిలో దీక్షా శిబిరం వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు మద్దతు తెలిపారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలక్టరేట్‌ ధర్నా చౌక్‌ వద్ద, ఎన్‌టిఆర్‌ జిల్లా విజయవాడలో సమ్మె కొనసాగింది.

➡️