సమ్మెలోకి ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు

Dec 20,2023 22:07 #SSA employees, #strike

-కలెక్టరేట్లు, డిఇఒ కార్యాలయాల వద్ద ధర్నా

-రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు

ప్రజాశక్తి-యంత్రాంగం :సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగులు బుధవారం నుంచి సమ్మెలోకి వెళ్లారు. ఎంఇఒ కార్యాలయ సిఆర్‌పిలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ కోఆర్డినేటర్లు, మండల స్థాయి అకౌంటెంట్లు, మెసెంజర్స్‌, సహిత విద్యా రిపోర్స్‌ పర్సన్లు, భవిత ఆయాలు, ఫిజియోథెరపిస్థులు, ఆర్ట్‌, కాప్ట్స్ర్‌, టీచర్లు, కెజిబివి ఉపాధ్యాయులు, పిఇటిలు, ఎఎన్‌ఎంలు, నైట్‌ వాచ్‌మెన్లు, ఉర్దూ, అరబిక్‌ టీచర్లు విధులను బహిష్కరించి సమగ్ర శిక్షా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (జెఎసి) ఆధ్వర్యాన సమ్మెకు దిగారు. దీంతో, ఆయా విభాగాలపై సమ్మె ప్రభావం పడింది. సమగ్ర శిక్షా ప్రాజెక్టులోని అన్ని విభాగాల ఉద్యోగులనూ క్రమబద్ధీకరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత, హెచ్‌ఆర్‌ఎ, డిఎతో మినిమం టైమ్‌ స్కేల్‌ రూ.26 వేలు చెల్లించాలని, ఇపిఎఫ్‌, ఇఎస్‌ఐ అమలు చేయాలని, పదవీ వివరణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని, రూ.10 లక్షలు గ్రాట్యూటీ ఇవ్వాలని తదితర 16 డిమాండ్లతో సమ్మెలోకి వెళ్లారు. డిఇఒ కార్యాలయాలు, కలెక్టరేట్లు వద్ద, మండల కేంద్రాల్లో సమ్మె శిబిరాలు నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి ఈ కార్యక్రమం చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. వారి సమ్మెకు యుటిఎఫ్‌, ఎపిటిఎఫ్‌, ఎస్‌టియు, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. కాకినాడలో సమ్మె శిబిరాన్ని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు సందర్శించి మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరంలో ఆర్‌పిల యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.గురువులు పాల్గని ప్రసంగించారు. విద్యా శాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. పిఆర్‌సి అమలు చేయకపోవడం, నెలల తరబడి వేతనాలు విడుదల చేయకపోవడం దుర్మార్గమన్నారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగులు ధర్నా చేశారు. అనకాపల్లి, నెల్లూరులో డిఇఒ కార్యాలయం వద్ద, అల్లూరి జిల్లా పాడేరులో ఐటిడిఎ ఎదుట నిరసన తెలిపారు. తిరుపతి జిల్లాలోని 34 మండలాల నుంచి 310 మంది తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సమ్మె శిబిరం నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివార్లలో కలెక్టరేట్‌కు వెళ్లే దారిలో విస్సాకోడేరు వంతెన వద్ద, ఏలూరు, కృష్ణా జిల్లా మచిలీపట్నం, అన్నమయ్య జిల్లా రాయచోటి, కర్నూలు, అనంతరపురం, శ్రీకాకుళం కలెక్టరేట్ల వద్ద, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. వీటికి ముందు ర్యాలీలు నిర్వహించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిరసన తెలిపారు. ఫ్యాప్టో మద్దతు సమగ్ర శిక్షా అభియాన్‌ ఉద్యోగుల సమ్మెకు ఫ్యాప్టో మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం చైర్మన్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్‌ సిహెచ్‌ మంజుల, కో-చైర్మన్లు కె.నరహరి, బి.మనోజ్‌కుమార్‌, సిహెచ్‌.వెంకటేశ్వర్లు, కె.ప్రకాష్‌రావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్‌ సాయిశ్రీనివాస్‌, చిరంజీవి, శ్రీనివాసరావు, కోశాధికారి చింతల సుబ్బారావు, కార్యదర్శులు ఇమామ్‌ బాషా, మధుసూదనరావు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. రూ.14 వేల వేతనంతో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలల వేతనాలు బకాయిలు ఉన్నాయని తెలిపారు. 24 గంటలూ పనిచేయించుకుంటూ కనీస వేతన సౌకర్యాలు అమలు చేయకపోవడం, సకాలంలో చెల్లించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారితో చర్చించి సమ్మెను విరమింపజేయాలని కోరారు. లేకపోతే వారి పోరాటాల్లో ఫ్యాప్టో శ్రేణులు పాల్గంటారని తెలిపారు.

➡️