నివురుగప్పిన నిప్పు!

May 21,2024 23:32 #CS, #DGP, #met

-మోహరిస్తున్న రెండు పార్టీల కార్యకర్తలు
-రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్‌ సెర్చ్‌
-సిఎస్‌తో భేటీ అయిన డిజిపి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు దిగినప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. రెండు పార్టీల కార్యకర్తలు పరస్పర మోహరింపు కొనసాగుతూనేఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో నివురుగప్పిన నిప్పులా పరిస్థితి మారింది. రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నాడు పోలీస్‌శాఖ నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌లోనూ ఇదే విషయం తేటతెల్లమైంది. 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 1,104 వాహనాలను జప్తు చేశారు. ఈ వాహనాలు ఎవరివన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 482 లీటర్ల నాటుసారా, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్‌ డ్యూటీ లిక్కర్‌ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మద్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం అందింది. మరోవైపు ఎన్నికల రోజు, తదనంతరం జరిగిన దాడులకు సంబంధించి 2,790 మందిని గుర్తించారు. వీరిని ఇంకా పూర్తిస్థాయిలో అరెస్ట్‌ చేయలేదు. వీరిలో పలువురి ఆచూకీ తెలియడం లేదని చెబుతున్నారు. కార్డన్‌ సెర్చ్‌ సందర్భంగా డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తా మాట్లాడుతూ 85 మందిపై హిస్టరీ షీట్లు ఓపెన్‌ చేశామన్నారు. ముగ్గురిపై పిడి యాక్ట్‌, మరో ఇద్దరిని బహిష్కరించేందుకు సిఫార్స్‌ చేశామన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తిస్తే 112, 100కు డయల్‌ చేసి వివరాలు తెలపాలని కోరారు.
సిఎస్‌తో డిజిపి భేటీ
రాష్ట్రంలో ఎన్నికల రోజు, అనంతరం జరిగిన హింసపై సిట్‌ నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డితో రాష్ట్ర డిజిపి హరీష్‌కుమార్‌ గుప్తా భేటీ అయ్యారు. సిట్‌ నివేదిక ఆధారంగా ఎన్నికల కమిషన్‌ ఎలాంటి చర్యలకు సిఫార్సు చేస్తుంది, ఆ సిఫార్సులను ఎలా అమలు పరచాలి అనే అంశంపై వీరిరువురు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది.

➡️