సమస్యలను పరిష్కరించకపోతే ఎల్లుండి నుంచి సమ్మె

సిఎస్‌తో అంగన్‌వాడీ వర్కర్స్‌ సంఘాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సమస్యలు పరిష్కరించకపోతేఎల్లుండి నుండి (8వ తేది) సమ్మె లోకి వెడతామని అంగన్‌వాడీ వర్కర్స్‌, హెల్పర్స్‌ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలిపాయి. సిఐటియు అనుబంధ సంఘం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌, ఎఐటియుసి అనుబంధ సంఘం ఎపి అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోషియేషన్‌, ఐఎఫ్‌టియు అనుబంధ సంఘం ఎపి ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌్‌ యూనియన్ల నాయకులు బుధవారం అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో అంగన్‌వాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీని అమలు చేయడంతోపాటు అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణ్‌రావు, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బరావమ్మ, ఉపాధ్యక్షులు ఎన్‌సిహెచ్‌ సుప్రజ, నాయకులు టి గజలక్ష్మిని సిఎస్‌ను కలిసిన వారిలో వున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణ్‌రావు, కె సుబ్బరావమ్మ అంగన్‌వాడీల క్షేత్ర స్థాయి సమస్యలను సిఎస్‌కు వివరించారు. అంగన్‌వాడీ వర్కర్లు, మిని వర్కర్లు, హెల్పర్లకు కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. ఇపుడు ఇస్తున్న గౌరవ వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని తెలిపారు. నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణాలో కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ వేతనం ఇస్తానన్న ముఖ్యమంత్రి హామీ అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీలకు గ్రాట్యుటిని అమలు చేయాలని సుప్రీం కోర్టు చెప్పినా ప్రభుత్వాలు అమలు చేయడం లేదని అన్నారు. రిటైర్‌ అయ్యాక అంగన్‌వాడీలు దుర్భర జీవితం గడుపుతున్నారని తక్షణం గ్రాట్యుటిని అమలు చేయాలని కోరారు. రిటైర్మంట్‌ వయసును 62 ఏళ్లకు పెంచి, బెనిఫిట్స్‌ను రూ.5 లక్షలకు పెంచాలని, ఆఖరి వేతనంలో 50శాతం పెన్షన్‌గా ఇవ్వాలని కోరారు. 48 ఏళ్ల సర్వీసు తర్వాత మృతి చెందినా కనీసం మట్టిఖర్చులకు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటినీ అంగన్‌వాడీలకు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంగన్‌వాడీలకు ఇచ్చిన ఫోన్‌లు పనిచెయ్యడం లేదని వివరించారు. యాప్‌ల నిర్వహణ పేరుతో జరుగుతున్న వేధింపులను ఆపాలని కోరారు. పదోన్నతులలో రాజకీయ జోక్యాన్ని నివారించాలని కోరారు. పెండింగ్‌లో వున్న అద్దెలు, టిఎ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ మెనూ చార్జీలను పెంచాలని, గ్యాస్‌ను ప్రభుత్వమే సరఫరా చేయాలని కోరారు. అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా సిఎస్‌ యూనియన్‌ నాయకులకు హామీ ఇచ్చారు. ఆర్థికపరమైన అంశాలను పరిశీలిస్తామని తెలిపారు.

➡️